‘సేఫ్ సిటీ’గా హైదరాబాద్: కెసిఆర్, లండన్ తరహా నిఘా
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ, సురక్షిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో నగరంలో పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నగరం మొత్తాన్ని ప్రతీ క్షణం వీక్షించేలా నిఘా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు.
‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్'పై సమీక్షించేందుకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిఎంఆర్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిఎంఆర్ ప్రతినిధులు ‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్'ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. లండన్ తరహా భద్రతా వ్యవస్థను, సిసి కెమెరాలు, అలారం సిస్టమ్, డేటా స్టోరేజీ అండ్ వీడియో అనాలటిక్స్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర వ్యవస్థలపై కూలంకషంగా వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ప్రపంచంలోని వివిధ నగరాల్లోని భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేయడంతోపాటు హైదరాబాద్‌కు అవసరమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. నగరీకణతోపాటే ట్రాఫిక్, జనసమ్మర్దం, ఆందోళనలు, మహిళలపై అఘాయిత్యాలు, అసాంఘిక చర్యల్లాంటి సమస్యలు పుట్టుకొస్తాయని, వాటి నివారణపై ఎక్కువ దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరాన్ని పది జోన్లుగా విభజించి ఎక్కడికక్కడ సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని, ఇందుకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రభావవంతంగా పనిచేయాలని కెసిఆర్ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, అజయ్ మిశ్రా, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సివి ఆనంద్, జిఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications