టీటీడీకి మరిన్ని టాస్కులు
Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలపై టీటీడీ దృష్టి సారించింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ఈ మూడు బిగ్ టాస్క్ లను కూడా విజయవంత చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఉద్యోగులతో సమావేశం అయ్యారు వారికి దిశానిర్దేశం చేశారు.
తిరుపతిలోని మహాతి ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వీ వీరబ్రహ్మం, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ దీనికి హాజరయ్యారు. టీటీడీ ఉద్యోగులు, తిరుపతి పోలీసులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు అభినందించారు.

తిరుమలలో బ్రహ్మోత్సవ సమయంలో కల్పించిన సౌకర్యాలపై భక్తులు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి చివరి రోజు వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్యాలరీలు, క్యూలైన్లు, గరుడ సేవ రోజు ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదాలు అందించేలా, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్ కాంతులు, పుష్ప అలంకరణలు, రవాణా, ట్రాఫిక్, తదితర సేవలలో అందరూ చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు.
వచ్చే బ్రహ్మోత్సవాలకు సీసీ కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి మూడు నెలల ముందు నుండే పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించుకున్నామని తెలిపారు.
ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారని అన్నారు. ఈ ఏడాది టెక్నాలజీ సేవలను సద్వినియోగం చేసుకున్నామని సుబ్బరాయుడు తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల, తిరుపతిలలో పార్కింగ్ సమస్య లేకుండా, వృద్ధులకు సేవలు, చిన్న పిల్లలకు జియో ట్యాగ్ సిస్టం ఏర్పాటు, సోషల్ మీడియా, సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications