మల్కాజిగిరిలో దిగ్గజాలు: జయసుధ టు పవన్(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మల్కాజిగిరి సీట్ నేతలకు హాట్‌గా మారింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటంతో సీమాంధ్ర ప్రాంత నేతల కన్ను పడింది. ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు మల్కాజిగిరి లోకసభకు పోటీ చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల పేర్లు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి.
తాజాగా ఏఐఎస్, ఐపిఎస్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోదరుడు, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సీటుకి ఉన్నంత డిమాండ్ మరే సీటుకూ లేదని చెప్పవచ్చు. లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పేరు కూడా వినిపిస్తోంది.
టిడిపిని జాతీయ పార్టీగా మార్చే ఆలోచనలో చంద్రబాబు.. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, వైయస్ కుటుంబ సభ్యుల్లో ఒకరు (షర్మిలకు అవకాశం) మల్కాజ్‌గిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా మల్కాజ్‌గిరి నుంచి లేదా కాకినాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.

పవన్
మల్కాజిగిరి స్థానం నుండి పవన్ కల్యాణ్ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడి నుండి సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్) 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనపై టిడిపి నుంచి భీమ్‌సేన్, పిఆర్పీ నుంచి దేవేందర్ గౌడ్, బిజెపి నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, లోక్ సత్తా నుంచి విజ్ఞాన్ రత్తయ్య వంటి ప్రముఖులు పోటీ చేశారు.

జయసుధ
సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు జయసుధ కూడా మల్కాజిగిరి స్థానం నుండి పోటీ చేయాలనో ఆలోచనలో ఉన్నారట. దేశంలోని అతిపెద్ద లోక్‌సభ స్థానాల్లో ఒకటైన మల్కాజ్‌గిరిలో పట్టణ మధ్యతరగతి ఓటర్ల సంఖ్య ఎక్కువ.

చంద్రబాబు
టిడిపిని జాతీయపార్టీగా చేయాలనుకుంటున్న చంద్రబాబు కూడా మల్కాజిగిరి నుండి లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, లోకసభ ఎన్నికలు ముందు వచ్చి అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే అలా పోటీ చేద్దామనుకున్నారు. ఇప్పుడు రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందున బాబు ఏం చేస్తారో చూడాలి.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబం నుండి కూడా ఒకరు పోటీ చేసే అవకాశముంది. ఎక్కువగా షర్మిలకు ఛాన్సుంది. కాగా, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2008లో ఏర్పడిన ఈ స్థానంలో 90 శాతం ఓటర్లు వారే. దీని పరిధిలోని మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సీ), మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్‌లలో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడినవారి సంఖ్య, క్రైస్తవ, దళిత ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ.

లక్ష్మీ నారాయణ
సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ పేరు కూడా వినిపిస్తోంది. ఏపిఎస్ అధికారి గోపినాథ్ కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయట. మల్కాజిగిరిలో పోటీలో నిలిచిన అభ్యర్థుల తలరాతలను తారుమారు చేసే స్థాయిలో (70%) సీమాంద్రులు ఇక్కడున్నారు. వీరిలో పట్టభద్రులు, ఉద్యోగుల సంఖ్య. వారిలో రాజకీయ చైతన్యం అధికం.












Click it and Unblock the Notifications