రాజయ్య బర్తరఫ్ వెనక కుట్ర: మల్లు భట్టి విక్రమార్క ఫైర్
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి రాజయ్యను భర్తరఫ్ చేయడం, ఆ వెంటనే కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు తెలుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డిప్యూటీ సీఎం తొలగింపు ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని తెలిపారు. రాజయ్య అవినీతి చేసివుంటే బయటపెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని శాఖల్లోనూ భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాజయ్యపై వేటు వేశారని మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.

సామాజిక తెలంగాణ ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరంకుశంగా తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా ఉండదని ఆయన అన్నారు. రాజయ్య తప్పులను తాము సమర్థిస్తామని అనుకోవడం పొరపాటు అని, ప్రతి శాఖలోనూ దోపిడీ జరుగుతోందని తాము చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితో విద్యారంగంలో అయోమయం నెలకొందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్, పోటీ పరీక్షల అంశాలపై గందరగోళాన్ని తొలగించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ దృక్కోణంతో పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను తొలగించాలనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. దేశం, తెలుగు జాతి కోసం కృషి చేసిన మాదిగల చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల నుంచి తొలగించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిలబస్ మార్పు పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లను పెండింగులో పెట్టడం అన్యాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications