నాయకత్వ మార్పుపై తేల్చేసిన సాయిరెడ్డి
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ నిర్వహణ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి వడివడిగా అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోన్నామనే సంకేతాలను పంపించింది.
గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కూడా.

పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రేపో మాపో ఈ బిల్లు టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2027లో ఏ క్షణంలోనైనా వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఎన్డీఏ కూటమికి.
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా బ్లాక్కు ఎవరు సారథ్యాన్ని వహించాల్సి ఉంటుందనే విషయంపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిపై స్పందిస్తోన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో జమిలి ఎన్నికలను ఎదుర్కొనడానికి సుముఖతను వ్యక్తం చేయట్లేదు
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ సీట్లు రావడం, ఈ ఏడాది జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎన్నికల్లో ఓటమిపాలు కావడం.. ఈ వ్యతిరేకతకు దారితీసినట్టయింది. ఇండియా బ్లాక్‌లోని ప్రధాన పార్టీలేవీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని పెద్దగా సమర్థించట్లేదు.
ఈ క్రమంలో- తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేరు తెర మీదికి వచ్చింది. ఇండియా బ్లాక్ సారధ్య బాధ్యతలను దీదీకి అప్పగించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. నాయకత్వం ఆమె చేతుల్లోకి వెళ్తేనే మెరుగైన ఫలితాలు వెలువడుతాయనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.
దీనిపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. దేశ రాజధానిలో పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా బ్లాక్‌కు కాంగ్రెస్‌కు బదులుగా మమత బెనర్జీ నాయకత్వాన్ని వహించాలని తేల్చి చెప్పారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని సాయిరెడ్డి గుర్తు చేశారు. మమత బెనర్జీకి అపార రాజకీయ అనుభవం ఉందని, ఇండియా బ్లాక్‌లోని అన్ని భాగస్వామ్య పార్టీలకూ మమత మాత్రమే న్యాయం చేయగలరని అభిప్రాయపడ్డారు.
ఎలాంటి పరిస్థితులనైనా మమత హ్యాండిల్ చేయగలదని సాయిరెడ్డి పేర్కొన్నారు. తాము మాత్రం దేశ రాజకీయాల్లో తటస్థంగా వ్యవహరిస్తోన్నామని, ఏ కూటమిలో కూడా భాగస్వామ్యులం కాదని అన్నారు. తటస్థ పార్టీగానే ఉంటామని అన్నారు. ఓ తటస్థ పార్టీ నేతగానే మమత బెనర్జీ నాయకత్వం గురించి తన అభిప్రాయం తెలిపానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications