నకిలీ గేట్ సర్టిఫికెట్లు: ఆంధ్ర యువకుడి మీద డెహ్రాడూన్‌లో కేసు
కాన్పూర్: ఇంజనీరు ఉద్యోగం సంపాదించడానికి నకిలీ మార్కుల జాబితా తీసుకు వెళ్లి ఇంటర్వూ చేస్తున్న వారిని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి మీద చివరికి డెహ్రాడూన్ లో కేసు నమోదు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుణతేజ ఎం. సుదర్శన్ అనే యువకుడి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. కాన్పూర్ గేట్ -2015 కన్వీనర్, ఐఐటీ కాన్పూర్ ప్రోఫెసర్ షానక్ చటర్జీ బుధవారం గుణతేజ గోల్ మాల్ వ్యవహారం గురించి వివరాలు వెల్లడించారు.
గుణతేజ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)లో ఉద్యోగం సంపాదించడానికి వెళ్లాడు. డెహ్రాడూన్ లోని ఓఎన్ జీసీలో ఇంజనీర్ ఉద్యోగాలకు జరుగుతున్న ఇంటర్వూలకు హాజరైనాడు. తరువాత గేట్ ఎగ్జామ్స్ లో తనకు 712 మార్కులు వచ్చాయని 100కు 53.33 శాంతం మార్కులు సాధించానని ఇంటర్వూ అధికారులకు చెప్పాడు.

అంతే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో 206 వ ర్యాంకు సంపాదించానని చెప్పాడు. అయితే ఇంటర్వూ చేస్తున్న అధికారులకు గుణ తేజ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. వెంటనే అతని మార్కుల జాబితాను గేట్-2015 కన్వీనర్ కు పంపించారు.
ఈ మార్కుల జాబితాను పరిశీలించాలని మనవి చేశారు. అయితే గేట్ -2015 ఎంట్రన్స్ లో గుణ తేజ పాస్ కాలేదని, అతనికి 100కు 17.67 మార్కులు వచ్చాయని కన్వీనర్ షానక్ చటర్జీ ఓఎన్ జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఓఎన్ జీసీ అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు గుణ తేజ సుదర్శన్ మీద కేసు నమోదు చేశారు. అతను ఇంటర్వూ అధికారుల దగ్గర ఇచ్చిన నకిలి సర్టిఫికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications