ప్రభుత్వం మారింది- ఆరోగ్యం పడకేసింది: విశాఖ కేజీహెచ్‌లో హృదయ విదారకం
KGH Visakhapatnam: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అయిదు గ్యారంటీలపై సంతకాలు చేశారు.
మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు. ఇప్పటివరకు నలుగురు మాత్రమే సచివాలయంలో అడుగు పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇదివరకే ఛార్జ్ తీసుకున్నారు.

తాజాగా- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. కొద్దిసేపటి కిందటే ఆయన సచివాలయంలో తన ఛాంబర్‌లో పూజాదికాలను నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య విశాఖపట్నంలోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్నారనే విషయాన్ని ఈ ఘటన తెర మీదికి తీసుకొచ్చింది.
నెలలు నిండకుండా పుట్టడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఓ పసిగుడ్డును మెటర్నిటీ వార్డు నుంచి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి ఓ తండ్రి పడ్డ ఆవేదన కలచి వేసింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించడానికి సిబ్బంది ఎవరూ సహకరించలేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
చివరికి ఓ నర్స్ ముందుకు వచ్చారు. పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని ముందు వెళ్తోండగా.. తండ్రి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకుని వెనకే వెళ్తుండటం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ ఉదంతం తన దృష్టిలోకి వచ్చిన వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివానంద స్పందించారు. సిబ్బందిని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications