చిట్టీల పేరుతో రూ. 3 కోట్ల టోకరా: కుటుంబంతో సహా పరారీ
హైదరాబాద్: చిట్టీలు వేయించుకొని పాట పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చిన వ్యక్తి కుటుంబంతో సహా పారిపోయాడు. బాధితులకు సుమారు రూ.3 కోట్ల పైచిలుకు చెల్లించాల్సి ఉందని సమాచారం. కృష్ణా జిల్లా పామర్రు మండలం పగిడిముక్కల గ్రామానికి చెందిన మర్రి ఏడుకొండలు అలియాస్ శ్రీనివాస్, అతడి భార్య నీరజ మదీనగూడలో స్థిరపడ్డారు.
వీరితో పాటు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరావు, మాధవి, రత్నకుమారి, సంజీవరావు గ్రూపుగా ఏర్పడి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు సక్రమంగా డబ్బులు చెల్లించి సభ్యులకు నమ్మకం కలిగించారు. మదీనగూడ, చందానగర్, మియాపూర్ పరిసరాలకు చెందిన అనేకమంది వీరి వద్ద చిట్టీలు వేశారు. కొంతకాలంగా పాట పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు, అప్పుడు అంటూ వాయిదా వేస్తున్నారు. వీరి వ్యవహారశైలిపై సభ్యులకు అనుమానం వచ్చింది. డబ్బు చెల్లించాలని నిలదీశారు.

దీంతో ఏడుకొండలు బుధవారం రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు సుమారు 20 మంది గురువారం మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్‌లో ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో మీడియా ప్రతినిధులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు అక్కరకొస్తుందని చిట్టీలు వేశామని కొందరు, ఇళ్లు కట్టుకుందామని మరికొందరు చిట్టీలు వేసినట్టు తెలిపారు. మదీనగూడకు చెందిన లక్ష్మి తనకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పగా, అదే ప్రాంతానికి చెందిన దమయంతి తనకు 4 లక్షలు ఇవ్వాలని వాపోయారు.
శ్రీనివాస్, నీరజ దంపతులతో పాటు మరో జంట శ్రీనివాస్‌రెడ్డి, చందన కూడా చిట్టీలు వేయిస్తున్నారని, వారి బాధితులు కూడా ఉన్నారని ఆరోపించారు. అయితే అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి భార్య చందన తమకు శ్రీనివాస్, నీరజ దంపతులతో సంబంధం లేదని చెప్పారు. తాము చిట్టీలు వేయిస్తున్న మాట వాస్తవమేనని, సభ్యులకు సక్రమంగా డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై మియాపూర్ ఎస్సై రఘుబాబును వివరణ కోరగా ఫిర్యాదు చేస్తే విచారిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications