ఆరోజు రాత్రి బయటకెళ్లాడు.. ఉదయాన్నే శవమై: పెళ్లికి రెండు రోజుల ముందు దారుణం
ఇబ్రహీంపట్నం: ఈ నెల 9న అతనికి వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లోవాళ్లంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి ఎవరో ఫోన్ చేస్తే బయటికెళ్లిన అతను.. తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఉదయం.. బంధువులకు చెందిన ఓ పొలం వద్ద విగతజీవిగా కనిపించాడు. పెళ్లి కావాల్సినవాడు ఇలా శవమై తేలడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఎవరతను?:
మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన దన్నె రమేశ్(25)కు, మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 9న వీరికి వివాహం జరగాల్సి ఉంది. రమేశ్ స్థానికంగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కిరాణ దుకాణాలకు తినుబండారాలను సరఫరా చేస్తుంటాడు.

ఆదివారం రాత్రి:
ఆదివారం రాత్రి రమేశ్ కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో.. అతను ఇంటినుంచి బయటకెళ్లాడు. రాత్రి 9.30గం.కి ఎవరో ఫోన్ చేశారని చెప్పి బయటకెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. సోమవారం ఉదయం కొంతమంది రైతులు.. ఇబ్రహీంపట్నం పటేల్ గూడ సమీపంలోని ఓ పొలం వద్ద అతను విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఒంటిపై కాలిన గాయాలు:
రమేశ్ శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రమేశ్ విగతజీవిగా పడి ఉన్న పొలం కూడా అతని బంధువులదే అని తెలిసింది. మృతదేహం పక్కనే మద్యం బాటిళ్లను కూడా గుర్తించారు.

హత్యా? ఆత్మహత్యా?
రమేశ్ అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications