వద్దన్నాడని అన్న కొడుకును నరికి చంపిన వ్యక్తి
చిత్తూరు: ఓ వ్యక్తి అత్యంత దారుణంగా తన అన్న కొడుకును భూమి తగాదాల నేపథ్యంలో తెగనరికి చంపేశాడు. అడ్డొచ్చిన మరో కొడుకును సైతం కత్తితో దాడి చేసి గాయపరిచాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవిబూదుగూరు గ్రామంలో పరశురామ్, పళణి, బలరామ్ ముగ్గురూ అన్నదమ్ములు. తండ్రి సంపాదించిన 3.50 ఎకరాల భూమిని ఉమ్మడిగా సాగు చేసుకుంటున్నారు.
భూమి పట్టా పరశురామ్ పేరుతోనే ఉన్నా విభజించుకుని పంటలు పెట్టుకున్నారు. అయితే భూమి హద్దులకు సంబంధించి పరశురామ్, బలరామ్ మధ్య రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బలరామ్ సరిహద్దులో ఉన్న ఒక టేకు చెట్టును నరకడానికి పూనుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పరశురామ్ కొడుకులు జగన్ (29), పెరుమాళ్ (21) చిన్నాన్నకు అడ్డు చెప్పారు.

ఉమ్మడిగానే భూమిని అనుభవిస్తున్నందున నువ్వొక్కడే ఎలా చెట్టు నరుకుతావని బలరామ్‌ను నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బలరామ్ ఆగ్రహంతో తన అన్న కొడుకులైన జగన్, పెరుమాళ్‌లపై కత్తితో దాడి చేశాడు. జగన్, పెరుమాళ్ ఇద్దరూ గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాయపడిన ఇద్దరినీ పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగన్ మృతి చెందాడు. పెరుమాళ్ కోలుకుంటున్నాడు.
ఇతడి ఫిర్యాదు మేరకే కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు కారకుడైన బలరామ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినల్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications