అక్రమ సంబంధమని అనుమానం: భార్యను, ఆమె మిత్రుడ్ని నరికి చంపాడు
గంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో అనుమానంతో భార్యను, ఆమె ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తిని భర్త హత్య చేశాడు. నడికూడి గ్రామానికి చెందిన చెన్నుబోయిన నాగేశ్వరరావుకు, అదే గ్రామానికి చెందిన అక్కినపల్లి దివ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు దివ్వ భర్త హనుమయ్యకు అనుమానం కలిగింది.
ఈ వివాదంపై పలుమార్లు పెద్దల వద్ద రాజీ జరిగింది. అయినా నాగేశ్వరరావు తన భార్య దివ్వతో మాట్లాడుతుండటంతో హనుమయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దాబా గార్డెన్‌లో భోజనం చేస్తున్న నాగేశ్వరరావు(25)ను హత్య చేశాడు. అనంతరం అదే కోపంతో ఇంటికి వచ్చిన హనుమయ్య భార్యను కూడా హతమార్చాడు. అనంతరం అతడు పారిపోయాడు.

తన భార్యతో మాట్లాడవద్దని నాగేశ్వరరావును పలుమార్లు హనుమయ్య హెచ్చరించాడు కూడా. అయినా అతను తీరు మార్చుకోలేదు. డాబాలో ఒంటరి భోజనం చేస్తున్న నాగేశ్వర రావును చూసిన హనుమయ్య బ్రాంది సీసాతో నాగేశ్వర రావుపై దాడి చేసి ఆ తర్వాత అతనిపై పడి పీక కోసి హతమార్చాడు.
అదే ఆవేశంతో ఇంటికెళ్లిన హనుమయ్యకు తన భార్య మొబైల్ ఫోనులో మాట్లాడుతూ కనిపించింది. దీంతో అతనికి కోపం మరింత ఎక్కువై భార్యపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హత్యా స్థలాలను పరిశీలించిమృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న హనుమయ్య కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications