భళే బురిడీ కొట్టించాడు: ఆస్ట్రేలియాలో ఉన్నానని చెప్పి 13 లక్షలు కాజేశాడు
అమరావతి: సోషల్ మీడియా ద్వారా మహిళలను చాలా తేలికగా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఉన్నానంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమె నుంచి రూ. 13 లక్షలు కాజేశాడో ప్రబుద్ధుడు.
మోసపోయిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కానూరు కామయ్యతోపు సమీపంలోని అక్షర పాఠశాలకు సమీపంలో గుత్తికొండ పద్మజ అనే యువతి నివసిస్తోంది.

గత ఏప్రిల్ నెలలో ఓ వివాహ వేదిక వెబ్ సైట్‌లో యువతి తన పేరును నమోదు చేసుకుంది. వెబ్‌సైట్‌లో యువతి ప్రొపైల్‌ను చూసిన డామ్నిక్ సంజయ్ అనే యువకుడు ఆమెను సంప్రదించాడు. తాను ఆస్ట్రేలియాలో ఉంటున్నానని, కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వస్తానని, వచ్చాక పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు.
అనంతరం యువతి ఆర్ధిక పరిస్ధితుల గురింతచి తెలుసుకుని తానే పెళ్లి ఖర్చులు భరిస్తానంటూ ఆమెలో ఆశలు రేపాడు. కొన్ని రోజుల గడిచిన తర్వాత యువతి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న అతడు తాను బార్సిలీ బ్యాంకులో 50 వేల డాలర్లు పంపుతానంటూ తెలిపాడు.
కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి పద్మజకు ఫోన్ చేసి తాను బార్సిలీ బ్యాంకు ఢిల్లీ శాఖ నుంచి మాట్లాడుతున్నానని, మీ పేరుపై 50 వేల డాలర్లు ఆస్ట్రేలియా నుంచి వచ్చాయని నమ్మించాడు. వీటిని డ్రా చేసుకోవాలంటే మనీ ట్రాన్స్‌ఫర్ రుసుం కింద రూ.1.27 లక్షలు తాను సూచించిన ఖాతాలో వేయాల్సి ఉంటుందని తెలిపాడు.
దీంతో ఇది నిజమేనని నమ్మిన ఆ యువతి ఈ మొత్తాన్ని చెల్లించింది. వచ్చిన డాలర్లకు ఆదాయపు పన్ను రూ.1.65 లక్షలు చెల్లించాలని మరికొద్ది రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి అడిగాడు. ఇలా టెర్రరిస్టు ఫీజు అని, బ్యాంక్ అప్రూవల్ రుసుం అంటూ విడతలవారీగా రూ.2.99 లక్షలు, రూ. 5.10 లక్షలను గుర్తు తెలియని వ్యక్తి తెలిపిన ఖాతాలో యువతి జమ చేసింది.
ఇలా రుసుముల రూపేణా యువతి నుంచి మొత్తం రూ.13.03 లక్షలు దోచుకున్నారు. బ్యాంకు నుంచి ఎంతకూ ఆస్ట్రేలియా డాలర్ల మొత్తం రాకపోవడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంజయ్ నుంచి ఫోన్లు తగ్గిపోవడంతో మోసపోయానని గ్రహించిన పద్మజ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications