బాబు టీ పర్యటనకు ముందే వేడి: మందకృష్ణ హెచ్చరిక, ఎర్రబెల్లి విజ్ఞప్తి
వరంగల్/ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ పర్యటన విషయంలో వాదవివాదాలు చెలరేగుతున్నాయి. పర్యటనకు ముందే వేడి పుడుతోంది. తెలంగాణలో చంద్రబాబు ఈ నెల 12వ తేదీ నుంచి పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరంగల్ పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మాటతప్పారని ఆరోపించారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ నిరసనను చవిచూడాల్సి వస్తదని మందకృష్ణ హెచ్చరించారు.
కాగా, ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవద్దని ఆయన మందకృష్ణ మాదిగను కోరారు. రేపటి చంద్రబాబు వరంగల్ పర్యటనకు ఎమ్మార్పీయస్ సహకరించాలని ఆయన అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకునే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు వరంగల్ పర్యటనకు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణను అభివృద్ధి చేసింది చంద్రబాబే..
తెలంగాణను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు తెలంగాణ పర్యటన అంశమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, టీడీపీ శ్రేణులను పునరేకీకరణ చేయడమే బాబు పర్యటన లక్ష్యమన్నారు.
ఢిల్లీలో వెలువడిన ఫలితాలు అన్ని పార్టీలకు ఓ హెచ్చరిక లాంటిదని మోత్కుపల్లి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఎన్నికలు జరగలేదని, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో అన్ని స్థానాలకు కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications