తొందరెందుకు.. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత దాని సంగతి చూద్దాం!
మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ఆయ నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు సాధ్యమైనంత మేర మంగళగిరి పరిధిలోని పలు గ్రామాలను చుట్టివచ్చారు. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో అన్న క్యాంటిన్ తోపాటు మొబైల్ హాస్పటల్ ను అన్ని గ్రామాలకు తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సొంత ఖర్చుతో రోడ్లు వేయిస్తున్నారు.

సత్తెనపల్లి నుంచి ఆళ్ల?
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అతన్ని సత్తెనపల్లి నుంచి పోటీకి దింపాలనే యోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. లోకేష్ ను బలహీనం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను వైసీపీలోకి చేర్చుకున్నారు. అక్కడ గట్టి పట్టున్న చేనేత వర్గంతో రాజకీయం చేసి లోకేష్ దెబ్బకొట్టాలనేది ఆ పార్టీ ప్రణాళిక. టీడీపీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన గంజి చిరంజీవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని అభ్యర్థిగా నిలబెట్టాలని వైసీపీ పావులు కదుపుతోంది.

విజయమే లక్ష్యం కావాలంటున్న లోకేష్
వైసీపీ తరఫున ఎవరు బరిలో నిలబడినా తనకు సంబంధం లేకుండా విజయమే లక్ష్యం కావాలనే దృక్పథంతో లోకేష్ ఉన్నారు. వైసీపీకి చెందిన కాండ్రు శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీలోకి వచ్చేలా చేశారు. గత ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి విజయం కోసం శ్రీనివాసరావు పనిచేశారు. చేనేత వర్గానికి చెందిన కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలోకి రావడం ఆ పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే గంజి చిరంజీవి వైసీపీలో చేరడం కూడా ఆ పార్టీకి లాభిస్తుందంటున్నారు.

పాదయాత్ర ప్రారంభమైన తర్వాత బలహీనపరచాలి..
లోకేష్ 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 400 రోజులపాటు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాతకానీ, మధ్యలోకానీ దాదాపుగా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ బలహీనం చేసి పైచేయి సాధించాలనే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ వ్యూహాలు ఏమేరకు పనిచేస్తాయో వేచిచూడాల్సి ఉంది.