అమరావతివైపు ప్రపంచ దేశాల చూపు, 'రాజధానిపై వారికే వదిలేద్దాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు జపాన్, చైనా, సింగపూర్, మలేషియా కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెలిపారు. నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయన్నారు.
ఆదివారం తన నివాసంలో రాజధాని నిర్మాణ సలహా సంఘం సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా రూపొందించి ఇచ్చిందన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
ప్రపంచంలో అద్భుత నగరం ఒకటి రాబోతోందనే ఊహలను దేశవ్యాప్తంగా చర్చకు సింగపూర్ ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ నాంది పలికిందన్నారు. రాజధానిలో రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు సహకారం అందించాలన్నారు.

రీ ఎనర్జీ స్మార్ట్ గ్రిడ్, విశాలమైన రహదారులు, డ్రైయిన్లు, పచ్చదనం, పరిశుభ్రత అభివృద్ధిలో ప్రపంచ స్ధాయి విధానాలు అనుసరించాలన్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నదీ ముఖ ద్వారాలు ఉండాలన్నారు. ఆధునిక సాంకేతికాభివృద్ధి వల్లనే ఇస్తాంబుల్ నగరం ఏడేళ్లలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.
గోదావరి పుష్కరాల సమయంలో తనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి రష్యా పర్యటనలో తాను సందర్శించిన కజకిస్తాన్, తుర్కుమినిస్తాన్ రాజధాని నగరాలు గొప్పగా ఉన్నాయని, వాటి నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని, ప్రత్యేక బృందాలను పంపాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
అక్టోబర్ 22న రాజధాని శంకుస్ధాపన నిర్మాణం పనులు వేగం అందుకుంటాయన్నారు. రెండు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల మధ్య పోర్టు బేస్డ్ కేపిటల్‌లో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. గాంధీనగర్, చండీగడ్, నయారాయపూర్, నవీ ముంబై నగర నిర్మాణాలను, వాటిలో లోపాలను గుర్తించి చర్చించారు.
కొత్త రాజధానిలో గ్రీన్ కవర్, కాలుష్య రహిత వ్యవస్ధల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలన్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా చేస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో గొప్ప ప్రణాళిక ఉండాలన్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వాటికయ్యే ఖర్చు, నిర్మాణ ప్రణాళిక, అభివృద్ధి తదితర వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని సూచన మేరకు తజకిస్తాన్ రాజధాని దుషన్‌బే, తుర్కమెనిస్తాన్ రాజధాని అష్గాబట్‌ను సందర్శించాలని సూచించారు.
రాజధాని నిర్మాణ సలహా సంఘ సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం ఒక రాజధానికి వెళ్లాలని, ఆ తర్వాత తానూ అక్కడికి వెళ్తానని ముఖ్యమంత్రి తెలిపారు. నౌకాశ్రయ ఆధారిత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
రాజధానిలో భవనాల నమూనా, ఆర్కిటెక్చర్ బాధ్యతలను ప్రభుత్వమే చూడాలా? నిర్మాణాలు చేపట్టే ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా? అన్న విషయమై చర్చించారు. చివరకు అభివృద్ధిదారుకే ఆ బాధ్యతను వదిలేయాలని సమావేశంలో తీర్మానించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో ఇస్తాంబుల్ నగరం ఏడేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కన్నా టర్కీ ఎయిర్‌లైన్స్ ముందు స్థానంలో ఉందని, విమాన ప్రయాణికుల సంఖ్య మూడు మిలియన్ల నుంచి 24 మిలియన్లకు పెరిగిందని తెలిపారు.
రెండు కోట్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్‌లో తలసరి ఆదాయం పది వేల డాలర్లని తెలిపారు. పర్యాటకం అభివృద్ధి తదితర టర్కీ పర్యటన విశేషాలను సభ్యులకు వివరించారు. జపాన్ పర్యటనలో అక్కడి ప్రధాని, మంత్రులు, అధికారులు, జైకా, నెడో, మెటి ప్రతినిధుల అభిప్రాయాలను ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications