చేరికలు, సీనియర్లు పోటీ: మంత్రివర్గ విస్తరణ బాబుకు కత్తి మీద సామే..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆనందాన్నిచ్చే విషయమే. కానీ, అదే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణను కత్తి మీద సాములా తయారు చేయనుంది.
మంత్రివర్గంలో చేరడానికి టిడిపి సీనియర్ శాసనసభ్యులు క్యూ కడుతున్నారు. మరోవైపు, కొత్తగా వైసిపి నుంచి చేరిన కొంత మందికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను అందరికీ ఆమోదయోగ్యంగా చంద్రబాబు ఎలా చేపడుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
బండారు సత్యనారాయమమూర్తి, గౌతు శ్యామసుందర శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాగిత వెంకట్రావు, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి వంటి సీనియర్ శాసనసభ్యులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడి వంటి ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు.
కాగా, వైసిపి నుంచి వచ్చిన సుజయకృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్, భూమా నాగిరెడ్డిలకు మంత్రి పదవులు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలువురు టిడిపి సీనియర్ శానససభ్యులు మంత్రి పదవులు ఆశిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను చంద్రబాబు ఎలా పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సుజయకృష్ణ రంగారావు వల్ల విజయనగరం జిల్లాలో, జ్యోతుల నెహ్రూ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో, భూమా నాగిరెడ్డి వల్ల కర్నూలు జిల్లాలో టిడిపి ఆశావహులకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. జలీల్ ఖాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకుంటే గత మూడు దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న సీనియర్ శాసనసభ్యులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.
కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డికి, భూమా నాగిరెడ్డికి మధ్య సయోధ్య కుదరడం లేదు. విజయనగరం జిల్లాలో సుజయకృష్ణ రంగారావు ప్రవేశంతో మంత్రి మృణాళినితో పాటు సీనియర్ శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారు.
గతంలో మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ చీఫ్ విప్ కాగిత వెంకటరావు తీవ్రమైన రక్తంపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యారు. పొన్నూరు శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఐదో సారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారు.
భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది కూడా తెలియడం లేదు. మొత్తం మీద, మంత్రివర్గ విస్తరణ చంద్రబాబుకు కత్తి మీద సాము కానుంది.












Click it and Unblock the Notifications