వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: నడిచిన కాలం మీద పొడిచిన పొద్దు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరివేరినట్లైంది. దాదాపు 60 ఏళ్లకు పైగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులకు గురైనప్పటికీ వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని చివరకు తెలంగాణ ప్రజలు తమ కలను సాకారం చేసుకున్నారు. మంగళవారం తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, గురువారం రోజున రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించినట్లయింది.

తమ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, తాము ఆంధ్రా పాలకుల పాలనలో పూర్తిగా నష్టపోయామని భావించిన తెలంగాణవాదులు తమ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని సాధించే వరకు కొనసాగించారు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పటి నుంచీ కొనసాగింది. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఉద్యోగావకాశాల కోసం వేసిన కమిటీలు, పెద్ద మనుషుల ఒప్పందం లాంటి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ వచ్చారు.

Many milestones in the saga of separate Telangana

1969లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో దాదాపు 300మందికి పైగా తెలంగాణ వాదులు తమ ప్రాణాలను అర్పించారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఉద్యమాన్ని అణచివేశారు. ఆ తర్వాత 1972లో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు జై ఆంధ్రా ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంతో ఆరు సూత్రాల పథకం, ఆ తర్వాత 610 జీవోను ప్రభుత్వం అమలు చేసింది. అక్కడితో ఆ ఉద్యమం ఆగిపోయింది.

అయితే తెలంగాణ ఉద్యమం మాత్రం అవకాశం ఉన్నప్పుడల్లా తన ఆకాంక్షను చాటుకుంటూనే వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు తమ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం అవసరం లేదని, దానికోసమే పోరాటం కొనసాగించారు. కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. ప్రజలు తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఆయనకు మద్దతు పలికారు.

చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో 2009-10లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. వందలాది మంది విద్యార్థులు, తెలంగాణవాదులు తమ ప్రాణాలను త్యాగం చేసుకున్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రజలు మాత్రం తమ ఆకాంక్ష కోసం పోరాటం సాగిస్తూనే వచ్చారు.

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరివేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ ఉద్యమ క్రమాన్ని ఒక్కసారి తేదీల వారీగా పరిశీలించినట్లయితే..

1944: తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం.
1948 సెప్టెంబర్ 13: ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) ప్రారంభం.
1948 సెప్టెంబర్ 17: హైదరాబాద్ రాష్ట్రంపై పోలీస్ యాక్షన్ పూర్తి. భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం.
1948: తెలంగాణ సాయుధ పోరాటం విరమణ.
1950: తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు.
1952: హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల్లో తొలి ఎన్నికలు.
1953 అక్టోబర్: మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు.
1956 నవంబర్ 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో విలీనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు.
1969: ప్రత్యేక రాష్ట్రం కోసం 'జై తెలంగాణ' ఉద్యమం.
1972: ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 'జై ఆంధ్ర' ఉద్యమం.
1975: ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు.
1975: ఉద్యోగ నియమకాల్లో అవకతవకల్ని సవరించేందుకు 610 జీవో విడుదల.
1996: ఏఐపీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ విధాన ప్రకటన వరంగల్ డిక్లరేషన్
1997: భువనగిరి సభలో తెలంగాణ జనసభ ఆవిర్భావం
1997: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర్ట డిమాండ్‌కు బీజేపీ మద్దతు ప్రకటన.
1998: శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదం.
1998: 'జై తెలంగాణ' పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన ఇంద్రారెడ్డి. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరిక.
2001 ఏప్రిల్ 27 : కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు
2004: ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు. ఐదు లోక్‌సభ స్థానాలు, 26 శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం. తెలంగాణ తెలంగాణ అంశాన్ని ఎన్నికల మానిఫెస్టోలో చేర్చిన యూపీఏ.
2008: తెలంగాణకు టీడీపీ మద్దతు ప్రకటన.
2009: నవ తెలంగాణ పేరుతో దేవేందర్ గౌడ్ పార్టీ స్థాపన.
2009: ఎన్నికల్లో టీఆర్ఎస్-టీడీపీ కలిసి పోటి. 2 లోక్‌సభ స్థానాలు, 10 శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు.
2009 సెప్టెంబర్ 2: అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మృతి. రాష్ట్రంలో అస్థిరత.
2009 నవంబర్ 29 : కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభం.
2009 నవంబర్ 30: ఉస్మానియా విద్యార్థి ఉద్యమం ఆరంభం.
2009 డిసెంబర్ 2: ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను హైదరాబాద్‌కు తరలించిన అధికారులు.
2009 డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటన.
2009 డిసెంబర్ 10: ఆంధ్ర, రాయలసీమ శాసనసభ, లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఆరంభం.
2009 డిసెంబర్ 23: రాష్ట్ర ఏర్పాటుపై సంప్రదింపుల కోసం కేంద్రం ప్రకటన.
2010 ఫిబ్రవరి 3: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన కోసం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు.
డిసెంబర్: శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ.
2011 మార్చి 10: మిలియన్ మార్చ్. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత.
సెప్టెంబర్: సకల జనుల సమ్మె ప్రారంభం.
అక్టోబర్ 14: సమ్మె విరమణ.
2012 సెప్టెంబర్ 30: సాగరహారం.
2013 జూలై 30: తెలంగాణకు సీడబ్ల్యూసీ ఓకే
అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్ విభజనకు యూనియన్ కేబినెట్ ఆమోదం. జీవోఎం ఏర్పాటు.
అక్టోబర్ 25: రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రధానికి సీఎం కిరణ్ లేఖ.
డిసెంబర్ 5: బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. బిల్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చెంతకు.
డిసెంబర్ 12: హైదరాబాద్‌కు చేరిన బిల్లు.
డిసెంబర్ 16: శాసనసభ, మండలికి బిల్లు.
2014జనవరి8: ఉభయసభల్లో చర్చ షురూ
జనవరి 21: చర్చకు మరో నాలుగు వారాల గడువు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. వారం గడువు పెంచిన రాష్ట్రపతి.
జనవరి 27: బిల్లును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌కు తేల్చిచెప్పిన సీఎం కిరణ్
జనవరి 30: మూజువాణి పద్ధతిలో బిల్లు తిరస్కరణ. బిల్లును పార్లమెంటుకు పంపవద్దంటూ రాష్ట్రపతికి వినతి.
ఫిబ్రవరి 5: బిల్లుకు నిరసనగా ఢిల్లీలో సీఎం దీక్ష.
ఫిబ్రవరి 7: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ సీమాంధ్ర నేతలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్ర కేబినెట్. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం కోసం రాష్ట్రపతి చెంతకు.
ఫిబ్రవరి 11: లోక్‌సభలో ఆరుగురు సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ.
ఫిబ్రవరి 13: పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్. లోక్‌సభలో పెప్పర్ స్ప్రే కొట్టిన ఎంపీ రాజగోపాల్. 16 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్.
ఫిబ్రవరి 18: బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఫిబ్రవరి 20: రాజ్యసభ ఆమోదం.

English summary
The passage of Telangana Bill in Rajya Sabha on Thursday marks the realisation of a demand which cropped up almost 60 years ago and saw a journey punctuated by violent agitations and stiff resistance from certain quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X