తెరాస ఎమ్మెల్యేలు: టిడిపి నుండే ఎక్కువమంది వెళ్లారు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు జోరందుకుంటున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయి. తెరాస వల్ల ఎక్కువగా దెబ్బతిన్నది... తెలుగుదేశం పార్టీయేనని చెప్పవచ్చు. కెసిఆర్ కూడా స్వయంగా టిడిపి నుండి వచ్చి పార్టీని స్థాపించిన వారే. తెలంగాణ కల ఫలించడంతో.. పునర్ నిర్మాణం కెసిఆర్‌తోనే సాధ్యమని భావిస్తూ పలువురు నేతలు తెరాసలోకి క్యూ కడుతున్నారు.
ఒకప్పుడు వివిధ పార్టీల సమ్మేళనంగా కనిపించిన తెరాస ఇప్పుడు పూర్తిగా టిడిపి నేతలతో నిండిపోతోంది. అక్కడక్కడా కాంగ్రెస్‌పార్టీ నుంచి వచ్చిన వారు కనిపిస్తున్నప్పటికీ, సైకిల్ దిగి కారు ఎక్కుతున్న వారే అధికమయ్యారు. కెసిఆర్ 2001లో టిడిపికి రాజీనామా చేసి పార్టీని పెట్టారు. అయినప్పటికీ తెరాసలో అప్పుడు టిడిపి మాజీ నాయకులతో పాటు ఇతర పార్టీల వారు కూడా ఉండేవారు.

2004 ఎన్నికల వరకు ఈ ఒరవడి కొనసాగింది. నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో అందులో చాలామంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనంతర రాజకీయ పరిణామాల్లో తెరాస నుంచి బయటికి వలసలు మొదలయ్యాయి. 2009 ఎన్నికల ఫలితాలతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మృతి చెందడం, తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో తెరాస మళ్లీ పుంజుకుంది. పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించడంతో అవి మరింతగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌తో తెరాస సన్నిహిత సంబంధాలు నెరపడం, టిడిపి నుంచి వలసలను పెద్దఎత్తున ప్రోత్సహించడంతో ఆ పార్టీ నుంచే ఎక్కువ మంది తెరాసలోకి వస్తున్నారు.
తెరాస అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలలోనే కాకుండా, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను చూస్తే, అందులో ఎక్కువమంది టిడిపి నుంచి వచ్చిన వారే. ప్రస్తుత తెరాస ఎమ్మెల్యేలలో కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, చెన్నమనేని రమేష్, జోగు రామన్న, గంప గోవర్దన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, మొలుగూరి భిక్షపతితోపాటు, స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికై గులాబీ గూటిలో ఉన్న సోమారపు సత్యనారాయణ కూడా ఒకప్పుడు టిడిపికి చెందిన వారే.
ఎమ్మెల్యేలు కొప్పుల హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలా చారి, గంగుల కమలాకర్, హన్మందు షిండే, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, సత్యవతి రాథోడ్, నగేష్, ఎల్లారెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి.. వీరందరూ టిడిపి నుంచి గెలిచి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆదివారం తెరాసలో చేరిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా టిడిపి నుంచి ఎన్నికయ్యారు. వీరే కాకుండా పార్టీలో ముఖ్య నేతలుగా చలామణి అవుతున్న వారిలో చాలామంది ఒకప్పుడు టిడిపి నుండి వెళ్లిన వారే.
కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనా చారి, అజ్మీరా చందూలాల్, మంద జగన్నాథం తదితరులు ఉన్నారు. తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా దాదాపు సగంమంది టిడిపి నుండి నుంచి వచ్చిన వారే ఉన్నారు. కాగా, కొత్త చేరికల వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తొలితరం నేతలు చిన్నబోతున్నారట.












Click it and Unblock the Notifications