మహిళను చంపి, ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతిపెట్టిన మరో మహిళ .. ఎందుకంటే!
మార్కాపురం జిల్లాలో ఇటీవల ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను చంపి ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతిపెట్టిన ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోర హత్య కేసు వివరాలలోకి వెళితే పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన మూడమంచు ఆదిలక్ష్మిని సమీప బంధువైన మరో మహిళ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అధిక వడ్డీ ఆశ చూపి మహిళను మోసం చేసిన బంధువు
ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినప్పటికీ, తాజా విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ఆదిలక్ష్మికి అర్థవీడు మండలం వీరభద్రాపురానికి చెందిన ఆ బంధువు అధిక వడ్డీతో డబ్బు ఇస్తానని ఆశ చూపింది. రూ.లక్షకు రూ.లక్ష లాభం వస్తుందని నమ్మించి, మొదట్లో కొంత మొత్తం రెట్టింపు ఇచ్చి విశ్వాసం కల్పించింది. దీనితో ఆదిలక్ష్మి ఇంట్లోని నగదు, నగలు అమ్మి, బయట అప్పులు చేసి మొత్తం రూ.50 లక్షల మేర ఆమెకు ఇచ్చింది.

డబ్బులు ఇస్తానని పిలిచి చంపి, ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతిపెట్టిన మహిళ
భర్త వారించినా వినకుండా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఆ మహిళ మోసం చేసింది. తప్పించుకుని తిరుగుతుంది. ఆదిలక్ష్మి తన డబ్బుల కోసం సదరు మహిళను పదేపదే నిలదీయడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జూన్‌లో డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి గ్రామ సమీపంలోని పంటపొలంలో పాతిపెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుందన్నారు.
బంధువైన మహిళ, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బయటపడిన నిజం
సెల్‌ఫోన్‌ను సమీప కుంటలో విసిరేసిందని చెప్పారు. ఆదిలక్ష్మి ఆచూకీ లేకపోవడంతో భర్త బాలగురవయ్య జూన్ 24న పెద్దారవీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 21న కేసు నమోదై దర్యాప్తు ముమ్మరమైంది. సెల్‌ఫోన్ సంకేతాలు వీరభద్రాపురం వైపు చూపడంతో ఆ మహిళ, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తెలియదని చెప్పినా, విచారణలో నిజాలు బయటపడ్డాయి.
నేడు మృతదేహం వెలికితీత
గురువారం నిందితురాలు చెప్పిన ప్రాంతంలో పోలీసులు పరిశీలన చేసి ఆనవాళ్లు కనుగొన్నారు. గుంటూరు ఫోరెన్సిక్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీయనున్నారు. నిందితురాలి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ మహిళ వలలో మరో ఇద్దరు కూడా చిక్కుకుని రూ.60 లక్షల మేర డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. . పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications