అధికారులారా.. ఈ కుక్కలే నయం! వినూత్న నిరసనతో షాక్!! (వీడియో)
జనానికి కుక్కలు కరవడం తెలుసు.. అధికారులకు కాగితాలు కొరకడం తెలుసు. కానీ అధికారులు కూర్చునే ఆఫీసులోనే కుక్కలను కొలువు తీరిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే వినూత్న ఆలోచన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిపాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో జరిగింది. వీధి కుక్కల కాటుతో విసిగివేసారని యువసేన కార్యకర్తలు.. తమ వేదనను అధికారులు పట్టించుకోవడం లేదనే కోపంతో ఏకంగా నాలుగైదు ఊర కుక్కలను పట్టుకొచ్చి నగర పంచాయతీ చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే ఛాంబర్లో వదిలేశారు. ఊరి జనానికి రక్షణ కల్పించలేని పాలకులు కనీసం ఈ కుక్కల ముద్దుముచ్చట్లు అయినా దగ్గరుండి చూసుకోవాలని వారు ఈ సాహసానికి ఒడిగట్టారు.
అంతటితో ఆగకుండా ఆ కుక్కులను ఆఫీసర్ టేబుల్ పైనే కూర్చోబెట్టి నోట్ల దండ వేసి మరీ సత్కరించారు. " అయ్యా అధికారులారా! మీ పనితనానికి, వాయిదాల పద్ధతి కంటే ఈ కుక్కలే నయమనిస్తున్నాయి" అంటూ నిరసనకారులు చూపించిన ఈ ప్రేమను చూసి అక్కడ ఉన్న సిబ్బంది నోరెళ్లబెట్టారు. వినూత్నమైన ఈ డాగ్ దర్బార్ ధాటికి ఆఫీసు సిబ్బందికి ఏం చేయాలో పాలుపోక కొద్దిసేపు కార్యాలయంలో భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి. కుక్కలు కూడా తమకు లభించిన రాయల్ ట్రీట్ మెంట్ కు కాసేపు షాక్ తిని, ఆఫీసు ఫైళ్లను ఆప్యాయంగా పరిశీలించాయి.

ఈ సందర్భంగా యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే మాట్లాడుతూ.. ఊరిలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలు, పెద్దలు, టూ వీలర్ వాహనదారులపై విరుచుకుపడుతున్నా పాలకు నిద్రమత్తు వీడటం లేదని మండిపడ్డారు. కుక్కల సంతాన నియంత్రణ, స్పెషల్ డాగ్ క్యాచింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు కాగితాలకే పరిమితం చేశారే తప్ప చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకు 'జనానికి ఇక కాగితపు హామీలు వద్దు.. ప్రత్యక్ష చర్యలే ముద్దు" అని తేల్చి చెప్తూ.. సమస్య తీర్చకపోతే మళ్లీ సర్కారు కార్యాలయాల్లో కుక్కల సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
ఈ క్రమంలో షాక్ నుంచి తేరుకున్న చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే ఎప్పటిలాగే తమ వద్ద ఉన్న పాత హామీల పెట్టను మళ్లీ తీశారు. తమ నగర పంచాయతీ ఇప్పటికే కుక్కల స్టెరిలైజేషన్ చర్యలను ప్రారంభించిందని, త్వరలోనే సమస్యను సమీక్షించి కుక్కల సంఖ్యను అదుపులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏది ఏమైనా కుక్కల సమస్యపై అధికారులు కదిలే వరకు ప్రతి కార్యాలయంలోనూ ఇలాంటి వీధి కుక్కల వీఐపీ దర్శనాలు తప్పవేమోనని నిపాడ్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
Nashik - Yuva Sena district chief Vikram Randhave led an aggressive protest against the functioning of the Niphad Nagar Panchayat, drawing attention to the rising stray dog menace in the town. Randhave released four to five stray dogs inside the office of Chief Officer Dhiraj… pic.twitter.com/QhRXxl9BOe
— NextMinute News (@nextminutenews7) September 16, 2026














Click it and Unblock the Notifications
