ఏపీలో విద్యుత్ కోతలు - ఇక్కట్లు : చీకట్లో లాంతరుతో లోకేష్ ప్రచారం - ఆస్పత్రుల్లోనూ..!!
ఏపీలో విద్యుత్ కోతలతో ప్రజలకు ఇక్కట్లకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. డిమాండ్ పెరగటం.. సరఫరా అందుకు తగినట్లుగా లేకపోవటంతో అనధికారికంగా కోతలు విధిసతున్నారు. రాత్రి సమయాల్లో కోతలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గ్రామాలు గాఢాంధకారంలోకి జారిపోతున్నాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు అందుబాటులో లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అప్రకటిత కోతలతో
వారం రోజులుగా ఎటువంటి సమాచారం లేకుండానే విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. డిస్కంలు లోటు విద్యుత్‌గా చూపుతున్న మొత్తాన్ని సర్దుబాటు చేయటానికి అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ సంస్థలు కోతలు విధిస్తున్నాయి. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంపై డిస్కంలు ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ లేక పసికందులతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలోనూ విద్యుత్ కోతల ప్రభావం పడింది.
Recommended Video


పెరిగిన డిమాండ్ .. సరఫరా మాత్రం
ప్రస్తుతం రాష్ట్రంలో జెన్‌కోతో పాటు హిందుజా నుంచి వచ్చే థర్మల్ విద్యుత్‌తో కలిపి 90.79 ఎంయూలు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 9.5 ఎంయూలు, పవన, సౌర విద్యుత్ కలిపి 26 ఎంయూలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నుంచి సుమారు 40 ఎంయూల వచ్చినా రాష్ట్ర డిమాండ్ మేరకు ఇంకా 50 ఎంయూలు డిస్కంలు కొనాలి. ఇందుకు రోజూ కనీసం రూ.35 కోట్లు అవసరంగా తేల్చారు. విద్యుత్ ఎక్స్చేంజీల్లో డిమాండ్ భారీగి పెరిగింది. దీంతో.. ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్‌కు ఇక్కడ విద్యుత్ దొరకటం లేదు. ఇక, ఇదే సమయంలో..ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఈ విషయంలో టార్గెట్ చేస్తోంది.
చీకట్లో లోకేష్ లాంతరు యాత్ర
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేత లోకేష్ పర్యటిస్తున్న సమయంలో కరెంటు పోయింది. దీంతో లాంతరు చేతపట్టుకుని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బాదుడే బాదుడంటూ ముద్రించిన విసనకర్రలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ లోకేశ్ నిరసన వ్యక్తం చేశారు. ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నుంచి రూ.16 వేల కోట్లను ముక్కుపిండి వసూలు చేశారన్నారు. జగన్‌రెడ్డి విద్యుత్ చార్జీలను భారీగా పెంచడంతోపాటు అప్రకటిత కోతలను విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతల పైన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగానూ విమర్శలు ఎదుర్కోంటోంది.












Click it and Unblock the Notifications