మ్యాచ్ ముగిసింది: సిఎంకు శ్రీధర్ బాబు కౌంటర్
వరంగల్: కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయంతోనే తెలంగాణ మ్యాచ్ ముగిసిందని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మిగిలి ఉందని ఆయన అన్నారు. ఆ రకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి గురువారం ఉదయం రాజ్యసభ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మ్యాచ్ పూర్తి కాలేదని, చివరి బంతి వేసేంత వరకు మ్యాచ్ కొనసాగుతుందని అన్నారు. అంటే రాష్ట్ర విభజన ఆపడానికి ఇంకా సమయం ఉందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు.

దీనిపై శ్రీధర్ బాబు వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎదురు దాడి చేశారు. "మ్యాచ్ ఓవర్. సీడబ్ల్యూసీ నిర్ణయంతోనే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ కావాలంటే రీ ప్లే చేసుకోవచ్చు. అంతేగానీ రీ గేమ్ ఉండదు" అని అన్నారు.
నదీజలాలు, ఇతర అంశాలపై చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొందామని శ్రీధర్ భాబు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పంథాలోనే ఏర్పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications