అనురాధ కేసు: దీపావళికి ముందే హత్యకు ప్లాన్, పోలీసుల అదుపులో పరంధామ
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనురాధను, ఆమె భర్త కటారి మోహన్‌ను దీపావళి పండుగకు ముందే హత్య చేయడానికి దుండగులు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కాగా, హత్యలో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న చింటూ అనుచరుడు పరంధామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు లొంగిపోయిన ముగ్గురు దుండగుల విచారణలో పోలీసులు అసక్తికరమైన విషయాలను రాబట్టారు.
అనురాధ దంపతుల హత్యకు అంతకు ముందు రెండు సార్లు విఫలయత్నం చేశారని పోలీసుల విచారణలో తేలింది. మూడోసారి పని పూర్తి చేసినట్లు భావిస్తున్నారు. జులై 9వ తేదీన మేయర్ దంపతులను చంపడానికి దుండగులు కార్పోరేషన్ కార్యాలయంలోకి వచ్చారు. ఆ రోజు కార్పోరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కొందండన్‌ను మేయర్ అనుచరుడు కొట్టడంతో గొడవ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగుల ప్రణాళిక బెడిసి కొట్టింది.

గత నెల 28వ తేదీన మరోసారి అనురాధ దంపతులను చంపడానికి ప్రయత్నించారు. దీపావళి పర్వదినానికి ముందు చంపి, కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తాలనేది దుండగుల ప్రయత్నంగా తెలుస్తోంది. 28వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో దుండగులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు.
ఆ సమయంలో కార్పోరేషన్ ఉద్యోగి మురళి అనే వ్యక్తి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వకుండా కమిషనర్ వేధిస్తున్నారంటూీ మృతుడి భార్య ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగులు వెనుదిరిగారు.
ఆఖరుగా ఈ నెల 17వ తేదీన వేసుకున్న పథకాన్ని అమలు చేశారు. మేయర్ ఛేంబర్‌లోకి దుండగులు వెళ్లగానే ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బురఖా ధరించిన చింటూ ముఖానికి ఉన్న ముసుగును తొలగించడంతో అక్కడ ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దుండగులు అనురాధ దంపతులపై దాడి చేసి పారిపోయారు.












Click it and Unblock the Notifications