వంద కోట్లకు పైగా మోసం: జ్యువెల్లర్స్ ఓనర్ అరెస్ట్
హైదరాబాద్: బంగారం దిగుమతుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో ఎంబిఎస్ జ్యువెల్లర్స్ యజమాని సుఖేష్ గుప్తాని సిబిఐ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంగారం దిగుమతి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మినరల్స్ అండ్ మెటల్స్ కార్పోరేషన్(ఎంఎంటిసి)ను మోసం చేసిన కేసులో సుఖేష్‌ను సిబిఐ అధికారులు కోఠిలోని కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు.
గురువారం రాత్రి నుండి సుఖేష్‌ను ప్రశ్నించారు. శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎంఎంటిసిని రూ.180 కోట్ల మేర మోసం చేసిన కేసులో ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ జ్యువెల్లర్స్ పైన సిబిఐ 2012లో కేసు నమోదు చేసింది. ఎంఎంటిసి సిబిఐకి ఫిర్యాదు చేసింది.

ఎంఎంటిసిలోని పలువురు అధికారలతో కుమ్మక్కైన సుఖేష్ గుప్తా 2004 నుంచి 2011 వరకు వందకు పైగా కోట్ల విలువైన 5,800 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు రికార్డులో నమోదైంది. దీనిపై గతంలో ఎంబిఎస్ జ్యువెలరీ యజమాన్యానికి నోటీసులు అందించినప్పటికీ వారు స్పందించకపోవడంతో గురువారం రాత్రి పంజాగుట్టలోని ఎంబిఎస్ కార్యాలయంలో ఉన్న సుఖేష్ గుప్తాను తన చాంబర్‌లోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఎంఎంటిసికి చెందిన అధికారుల పైనా సిబిఐ కేసు నమోదు చేసింది. ఆర్‌సి.1 ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసులో ఎ1 నిందితుడిగా సుఖేష్ గుప్తా, ఎ2గా మోహన్ రావు, ఎ3గా అనంత కృష్ణ, ఎ4గా కెవి ప్రకాష్, ఎ5గా రవి ప్రసాద్, ఎ6 విజయ భాస్కర్, ఎ7గా రామ భీమప్ప, ఎ8గా శివ కిరణ్, ఎ9గా ప్రశాంత్, ఎ10గా పలువురు ప్రభుత్వ అధికారులను సిబిఐ నిందితులుగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
సుఖేష్ గుప్తాకు రిమాండ్
సుఖేష్ గుప్తాను సిబిఐ న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. కోర్టు ఆయనకు జనవరి 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఎంఎంటిఎస్ సీనియర్ మేనేజర్ రవి ప్రసాద్‌కు కూడా రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications