చంద్రబాబు - పవన్ కల్యాణ్ ను ఆపలేరు : నాగబాబు క్లారిటీ..!!
ప్రభుత్వం తాజాగా సభల నిర్వహణపైన తెచ్చిన జీవోపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రోడ్ల పైన సభల నిర్వహణకు అనుమతులు రద్దు చేసారు. ప్రత్యేక, అరుదైన సందర్భాల్లోనే అనుమతులు ఇస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. దీని పైన ఇప్పటికే టీడీపీ, జనసేనతో ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది హక్కులకు కాలరాయటమేనని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం పైన జనసేన నేత, మెగా బ్రదర్ నాగాబాబు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రభుత్వం తాజాగా సభల నిర్వహణ పైన జారీ చేసిన జీవో పైన నాగబాబు ఒక వీడియో విడుదల చేసారు. అందులో వైసీపీ ప్రభుత్వం భయం.. అభద్రతా భావంతోనే ఈ జోవో జారి చేసిందని నాగబాబు మండిపడ్డారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు సభలో ఎనిమిది మంది మరణించటం దురదృష్టకరమన్నారు. గుంటూరు లో జరిగిన ఘటన పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని.. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. సభలు నిర్వహించటం రాజకీయ పార్టీల హక్కు అని స్పష్టం చేసారు. ఏపీలో నడుస్తుంది ప్రభుత్వమా.. రాచరికమా అని ప్రశ్నించారు.

జగన్ పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ఇదే విధంగా రూల్స్ తెచ్చి ఉంటే పాదయాత్ర చేయగలిగేవారా అని నిలదీసారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో న్యాయస్థానాల్లో నిలబడుతుందా అని నాగబాబు సందేహం వ్యక్తం చేసారు. ఈ జోవో పైన కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీగా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని నాగబాబు పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ను ఎంత ఆపితే.. అంత లెగుస్తారని పేర్కొన్నారు నాగబాబు. జీవోను వెనక్కి తీసుకుంటే మంచిదన్నారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నాగబాబు హెచ్చరించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ జీవో వైసీపీతో సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications