బాబు వంచన, అర్థం కావడం లేదు: మేకపాటి నిప్పులు, ‘జెండా ఊపిన జగన్’
ప్రకాశం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి చంద్రబాబు చాలా అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తమకు అర్థం కావడం లేదన్నారు.
Recommended Video

చదవండి: పార్టీలో మిగిలిన 44 మందికి ఏ ఆపర్లు ఇస్తున్నారో నాకు తెలుసు: బాబుపై జగన్
రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని తెలియజేసేందుకే ఢిల్లీ వెళ్తున్నామని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మార్చి 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు వంచన
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాడుతామని మేకపాటి చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ వరకు పార్లమెంట్‌లో పోరాడుతామని ఆయన తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం కూడా పెడతామని స్పష్టం చేశారు. దీనికి ఎవరు సహకరిస్తారో.. ఎవరు సహకరించరో చూస్తామని అన్నారు.

అపహాస్యం చేస్తున్నారు..
ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసేంతవరకు అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ మేకపాటి ధ్వజమెత్తారు.

హోదా కోసం ఢిల్లీలో ధర్నా
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదిక ధర్నా నిర్వహించబోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మార్చి 5న ఢిల్లీలోని సంసద్ మార్గ్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు.

జెండా ఊపిన జగన్
ఈ నేపథ్యంలో తాళ్లూరుకు చేరుకున్న వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమైన వైయస్ జగన్.. ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా, ప్రత్యేక హోదా పోరాటం గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల ఢిల్లీ యాత్రను వైయస్ జగన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 5న ధర్నా, 21న పార్లమెంటులో అవిశ్వాసం పెడతామని జగన్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకే అవిశ్వాసం పెడుతున్నామని, టీడీపీ ఎంపీలు మద్దతిచ్చేలా చూడాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications