సైకిళ్లపై రెక్కీ నిర్వహించి దొంగతనం, ముఠా అరెస్టు
హైదరాబాద్: తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఆల్వాల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షలు విలువ చేసే 43 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సీసీఎస్ కార్యాలయంలో సమావేశంలో క్రైం అదనపు డీసీపీ జి. జానకి నిర్మల, ఏసీపీ రామ్ మోహన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన రతన్ సహా (38), హరిదాస్ బరూయ్ (30), రాకేష్ థాకూర్ (30), మగంల్ బయాద్ (26)లు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి కీసర మండలం , ఎల్లారెడ్డి గూడలో స్ధిరపడ్డారు. జనప్రియ నిర్మాణ సంస్దలో కూలీలుగా పని చేస్తున్నారు. వీరు వ్యసనాలకు అలవాటు పడడంతో వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు.

దీంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని నలుగురు ముఠాగా ఏర్పడి ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. ఆల్వాల్ డివిజన్ పరిధిలోనే ఏడు ఇళ్లలో దొంగతనాలు చేశారని పేర్కొన్నారు. సైకిళ్లపై తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ముఖ్యంగా కాలనీల్లో సాయంత్రం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 11 గంటల సమయంలో రెండుసార్లు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటికి ఉన్న కిటికీలు, వెంటిలెటర్లు గ్రిల్స్‌ను తమ వద్ద ఉన్న స్కూడ్రైవర్ తొలగిస్తారు.
అనంతరం ఇంట్లోకి చొరబడి నగదు, నగలను దొంగిలిస్తారు. చోరీ సొమ్ముతో తెల్లవారుజామునే హౌరా ఎక్స్‌ప్రెస్, ఇతర ట్రైన్ లలో గానీ తమ స్వస్దలాలకు పరారవుతారు. మళ్లీ నగరానికి వచ్చి యధావిధిగా వచ్చి దొంగతనాలు చేస్తారని వెల్లడించారు.
ఇతర రాష్టాల వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్త వహించాలని ఆల్వాల్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. తెలిసిన వారు మధ్యవర్తిగా ఉంటేనే ఇల్లు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా నగరానికి వచ్చిన వారికి నేరుగా ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications