ఏపీలో 14331 పోలీసు పోస్టులు ఖాళీ- లక్షకు 85 మందే- పనిభారంలో మూడోస్ధానం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్ధల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ ప్రతీ ఏటా నివేదికలు విడుదల చేస్తుంటుంది. వీటి ఆధారంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తుంటుంది. తాజాగా హోంశాఖ విడుదల చేసిన నివేదికలో ఏపీకి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా భారీ సంఖ్యలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు, అవి భర్తీ కాకపోవడం వల్ల ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీసులపై పడుతున్న పనిభారం, జనానికి ఎదురవుతున్న ఇబ్బందులు వంటి వాటిని ఈ నివేదికలో సవివరంగా పొందుపరిచారు.

ఏపీలో 14331 పోలీసు ఉద్యోగాలు
ఏపీలో కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగాల భర్తీ జరుగుతున్నా అది ఆశించిన స్ధాయిలో ఉండటం లేదు. రాష్ట్రానికి జనాభా ఆధారంగా కేంద్రం కేటాయించిన పోస్టులు 73894 కాగా.. ప్రస్తుతం ఇందులో 59553 మందే పనిచేస్తున్నారు. మరో 14331 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఏపీలో పోలీసుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ఈ పోస్టుల్లో అన్ని స్ధాయిల్లో ఖాళీగా ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి మొదలుపెడితే ఐపీఎస్‌ల వరకూ ఈ ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో సాధ్యమైనన్ని ఎక్కువ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఏపీలో లక్ష మందికి 85 మంది పోలీసులే
ప్రస్తుతం ఏపీలో ఉండాల్సిన పోలీసులకూ, విధులు నిర్వహిస్తున్న పోలీసులకూ మధ్య నిష్పత్తి దారుణంగా ఉంది. దీంతో ఉన్న పోలీసులపై పని భారం కూడా భారీగా పెరుగుతోంది. జనాభా ఆధారంగా ఏపీలో పోలీసు ఉద్యోగాలను చూసుకుంటే ప్రతీ లక్ష మంది జనాభాకు కేవలం 85 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తేలింది. ప్రతీ లక్ష మంది పోలీసులకు అతి తక్కువ పోలీసులు కలిగిన జాబితాలో ఏపీ ఆరో స్ధానంలో నిలిచింది. దీంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. నేరాల నియంత్రణలోనూ సమస్యలు తప్పడం లేదు. ఏపీలో పనిచేస్తున్న పోలీసుల్లో కేవలం 5.85 శాతం మంది మహిళలే ఉన్నట్లు హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది.

పని భారంలో మూడో స్ధానంలో ఏపీ
జనాభా ప్రాతిపదికన కేటాయించిన పోలీసు ఉద్యోగాలు ఏళ్ల తరబడి భర్తీ కాకపోవడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న వారిపై భారం అంతకంతకూ పెరుగుతోంది. ఇది దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీని ఏకంగా మూడో స్ధానంలో నిలబెట్టింది. పోలీసు పోస్టుల భర్తీ లేకపోవడం వల్ల పని భారం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్దానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అసలే పెరుగుతున్న వ్యవస్ధీకృత, సైబర్ నేరాలు ఓవైపు, దిశ వంటి చట్టాల రాకతో పెరుగుతున్న ఒత్తిడి మరోవైపు, రొటీన్ పోలీసింగ్ మరోవైపు.. ఏపీలో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నట్లు తాజా నివేదిక చెబుతోంది.

కింది స్ధాయి ఉద్యోగాల్లో భారీగా ఖాళీలు..
పోలీసు శాఖలో ఉన్నతస్ధాయి ఉద్యోగాలతో పోలిస్తే కింది స్ధాయి ఉద్యోగాల్లోనే ఖాళీలు అధికంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు వీటిని భర్తీ చేసేందుకు ముందుకు రావడం లేదు. గ్రూప్ స్ధాయి ఖాళీలతో పోలిస్తే కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల్లోనే ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఆర్ధిక భారం నెపంతో ఏటా వీటిని భర్తీ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రతీ ఏటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా అది ఇంత వరకూ ఆచరణలోకి రాలేదు. కొత్త సంవత్సరంలో అయినా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.