కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..: సీఎం రమేష్ పై మంత్రి ఆది సంచలనం
జమ్మలమడుగు: కడప రాజకీయాల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డికి, ఎంపీ సీఎం రమేష్ కి పడటం లేదా?.. మంత్రి ఆదికి సీఎం రమేష్ అడుగడుగునా అడ్డు వస్తున్నారా?.. నిజానిజాలేంటో వారికే తెలియాలి కానీ.. మంత్రి ఆది మాత్రం సీఎం రమేష్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు.
సీఎం రమేష్ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయని ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను గన్‌లాంటి వాడిని అని, కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గంలో సీఎం రమేష్ వందల కోట్లు పనులు చేసుకుంటున్నా తాము పట్టించుకోవడం లేదని చెప్పారు. కొంత మంది తమపై నీచంగా మాట్లాడుతున్నారని, తాను మార్కెట్ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు. గతంలో కొండాపురంలో ముంపువాసుల కాలనీల్లో చేపట్టిన పనులకు అడ్డుపడితే ఏమి జరిగిందో తెలుసుకోవాలని హెచ్చరించారు.
తన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు దేనికి సిద్దపడినా ఎదుర్కొనేందుకు తాను సిద్దమేనని ఆది తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను జమ్మలమడులగు నుంచే పోటీ చేస్తానని, టీడీపీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని ఆది విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన మినీ మహానాడులో మంత్రి ఆది ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, మినీ మహానాడుకు మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి దూరంగా ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications