చంద్రబాబు - పవన్ కలయికే జగన్ బలం : మంత్రి అంబటి..!!
మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు - పవన్ భేటీ పైన స్పందించారు. ఇది బీజేపీకి మినహా మరెవరికీ ఆశ్చర్యం కాదన్నారు. తమ పై పోటీ చేయటానికి రెండు పార్టీల అధ్యక్షులు ఒకరికి మరొకరు ధైర్యం చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ - చంద్రబాబు అందరినీ కలుపుకుంటామంటేనే జగన్ ప్రజాబలం ఏంటో వాళ్లే చెబుతున్నారని వివరించారు. చంద్రబాబు - పవన్ రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారని..ఇందులో కొత్త విషయం ఏమీ లేదన్నారు. పవన్ ను కాపులు నమ్మవద్దని రాంబాబు సూచించారు.

బీజేపీతో సంసారం- చంద్రబాబుతో లవ్
పవన్ కల్యాణ్ అటు బీజేపీతో సంసారం చేస్తూ ఇటు చంద్రబాబుతో లవ్ నడుపుతున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బీజేపీని రోడ్ మ్యాప్ కావాలని కోరిన పవన్..ఇప్పుడు ఆ పార్టీ నేతలతో చర్చించే చంద్రబాబును కలిసారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని విమర్శించారు. వాళ్ళిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాదు టీడీపీ పరిరక్షణ కోసం చర్చించుకున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కృషికి చంద్రబాబు ఎంత ఇవ్వాలి అనేది చర్చించుకున్నారని ఎద్దేవా చేసారు. ఈ భేటీ చూసి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నమ్మే అమాయకులు ఆశ్చర్యపోవాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ మీద ఎన్ని ఆంక్షలు పెట్టారో మర్చిపోయారా అని అంబటి ప్రశ్నించారు.

పవన్ లా చిరంజీవి డ్రామాలు ఆడలేదు..
చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి నడపటం చేతకాక.. కాంగ్రెస్ లో కలిపేసారని అంబటి చెప్పుకొచ్చారు. పవన్ లాగా చిరంజీవి డ్రామాలు ఆడలేదన్నారు. చంద్రబాబు..పవన్ ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని అంబటి ధీమా వ్యక్తం చేసారు. తమను జనసేన విమర్శిస్తూ తాము స్పందించకుండా ఊరుకోవాలా అని రాంబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ తనను చూసి భయపడేవారిని చంద్రబాబు చెబుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైఎస్సార్ దగ్గర చంద్రబాబు పాకెట్ మనీ తీసుకొనే వారని చెప్పుకొచ్చారు. జీవో నెంబర్ 1 కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెబుతున్నారని, జీవో నెంబర్ 1 ను వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని అంబటి తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఆ జీవో అన్నీ ఆలోచించే జారీ అయిందని చెప్పుకొచ్చారు.

పవన్ ను కాపులు నమ్మద్దు
పవన్ ను సీఎం అవుతారని భ్రమలు వద్దని అంబటి సూచించారు. 79 శాతం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తామని ధైర్యంగా చెబుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఏం జరిగినా పవన్ ను సీఎం కానీయరని రాంబాబు వివరించారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని..ఆ తరువాత రాష్ట్రానికి చివరి ఎన్నికలని రక రకాలుగా ప్రచారం చేసారన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక కుట్ర ఉందని చెబుతున్న చంద్రబాబు..కుప్పంలో పోలీసులు రాగానే ఎందుకు అలా వణికిపోయారని అంబటి ప్రశ్నించారు. ఎవరు కలిసినా..అందరూ కలిసి కట్టుగా వచ్చినా జగన్ సింగిల్ గానే అందరికీ సమాధానం చెబుతారని అంబటి ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications