వైఎస్ కుటుంబంతో పోలవరం బంధం: అది దేవుడు రాసిన స్క్రిప్ట్: ఎవరూ మార్చలేరు
అమరావతి: తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ పునరుద్ఘాటించారు. నిధుల కొరత, లాక్‌డౌన్ వంటి ఇబ్బందులు వచ్చినా నిర్మాణ పనులను ఒక్క రోజు కూడా ఆపలేదని చెప్పారు. నిర్దేశిత కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ నిర్మాణంపై లేదని విమర్శించారు. జయము జయము చంద్రన్న పాట కోసం 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు.

వైఎస్ హయాంలో 75 శాతం భూసేకరణ.. అనుమతులు
పోలవరం ప్రాజెక్ట్‌పై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా తమ ఈ జాతీయ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 48 గేట్లను అమర్చామని వివరించారు. దీని నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 75 శాతం భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2016 వరకు ఈ ప్రాజెక్ట్ ఊసే ఎత్త లేదని ఆరోపించారు.

జాతీయ ప్రాజెక్టును తాము కడతామంటూ..
సవరించిన అంచనాలకు సంబంధించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం కోరగా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. చేసింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి.. తన చేతుల్లోకి తీసుకోవడమే ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలన్నింటికీ కారణమని అన్నారు. జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల దీని నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉన్నప్పటికీ- తాము పూర్తి చేస్తామంటూ చంద్రబాబు ఆర్భాటాలకు పోయారని, చివరికి చేతులెత్తేశారని చెప్పారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై నోరెత్తని చంద్రబాబు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాత్రికి రాత్రి ప్రెస్‌మీట్లు పెట్టి బ్రహ్మండమైన ప్యాకేజీ వచ్చిందంటూ జబ్బలు చరచుకున్నారని, ప్రాజెక్ట్ నిర్మాణానికి 55 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని తెలిసిన తరువాత మిన్నకుండిపోయారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఆ ఆర్భాటమే ఇప్పుడు దళిత, గిరిజనులకు శాపంగా మారిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి లబ్ధి పొందాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా..ఈ విషయంపై చంద్రబాబును విమర్శించారని గుర్తు చేశారు.

రివర్స్ టెండరింగ్‌తో..
తమ ప్రభుత్వ హయాంలో- పోలవరం రివైజ్డ్ టెండరింగ్ వేసి 830 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టుకు ఎవ్వరైనా ఒక్కసారే శంకుస్థాపన చేస్తారు గానీ.. చంద్రబాబు తన హయాంలో ఆరు శిలాఫలకాలు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఒక్క గేటు పెట్టి దానికి శిలాఫలకాన్ని నిర్మించారని, ఇలా ప్రచారం కోసం 100 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు.

కోవిడ్ వల్ల ఇబ్బందులు..
తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వల్ల రెండు సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. లాక్‌డౌన్ ఉన్నా గానీ మూడు వేల మంది కార్మికులతో నిర్మాణ పనులను కొనసాగించామని, వారెవ్వరికీ వైరస్ సోకకుండా ప్రాజెక్టు వద్ద క్యాంపింగ్ ఏర్పాటు చేశామని, డాక్టర్లను నియమించామని గుర్తు చేశారు. టీడీపీ నేతలు కోవిడ్ సమయంలో హైదరాబాద్‌కు, ఇళ్లకు పరిమితమయ్యారని, ప్రజలు తమను మరిచిపోకుండా ఉండటానికి జూమ్ కాల్స్‌లల్లో కనిపించే వారని చురకలు అంటించారు.

అడ్డంకులు అధిగమిస్తూ..
ఆయా అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ చిత్తశుద్ధితో పోలవరం పనులను పూర్తి చేస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇది వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయిందని పేర్కొన్నారు. పోలవరాన్ని వైఎస్సార్ ప్రారంభించారని..ఆయన తనయుడు వైఎస్ జగన్ ఇది పూర్తి చేసేలా దేవుడు స్క్రిప్ట్ రాశాడని, దీన్ని ఎవరూ మార్చలేరని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications