సీనియారిటీలో సీఎం జగన్‌కు ఉపయోగపడ్డ మంత్రి బొత్స!!
సీనియారిటీ అనేపదానికున్న విలువ, గౌరవం వేరుగా ఉంటాయి. ఏ రంగంలోనైనా సీనియర్లు ఉంటారు. తమ అనుభవాలను జూనియర్లతో పంచుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆయా రంగాల్లో ఎలా పనిచేయవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇదే అంశాన్ని ఏపీ రాజకీయాలకు కూడా వర్తింపచేస్తే బొత్స సత్యనారాయణ తనకున్న సీనియారిటీని ఉపయోగించి ప్రభుత్వాన్ని రక్షించారని చెప్పవచ్చు.

ఉదాహరణగా నిలిచిన బొత్స
రాజకీయాల్లో సీనియారిటీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించేందుకు బొత్స ఒక ఉదాహరణగా నిలిచారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది.
ఈ నెల ఒకటోతేదీన విజయవాడలో చేయాలనుకున్న మిలియన్ మార్చ్‌ను ఉపాధ్యాయ సంఘాలు వాయిదావేశాయి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను ఎక్కడిక్కడ నిలువరించింది. అన్ని జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులివ్వడంతోపాటు వారు ఎక్కడికీ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వారి కదలికపై కూడా కన్నేసి ఉంచారు.

క్లిష్ట తరతుణంలో వచ్చిన గురుపూజోత్సవం
ఇటువంటి క్లిష్ట తరుణంలో గురుపూజోత్సవం సెప్టెంబరు 5 రానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 176 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులకు ఎంపిక చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చేతులుమీదగా వారికి వీటిని అందించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాలకు మధ్య పోరు నడుస్తుండటంతో ఏం చేయాలో తోచలేదు. మరోవైపు గురుపూజోత్సవాన్ని బహిష్కరించాలని సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి చేతులమీదగా అనుకున్న కార్యక్రమానికి వారు హాజరు కాకపోతే పరువు పోతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి.

చక్రం తిప్పిన బొత్స
విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తనకున్న సీనియారిటీని ఉపయోగించారు. ఉపాధ్యాయుల్లో, సంఘాల్లో ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని పిలిపించి మాట్లాడారు. వీరంతా అవార్డులకు ఎంపికైన 176 మందితో మాట్లాడారు. తోటి ఉపాధ్యాయుడిగా, తోటి స్నేహితుడిగా ఉండటంతో వాళ్లంతా కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. దీంతో ప్రభుత్వం పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లుగా భావించింది.
సీనియర్లు ఉంటే ప్రభుత్వ పరంగా, రాజకీయం పరంగా ఎంత ఉపయోగమో బొత్స నిరూపించారు. అందుకే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్న జగన్ సీనియారిటీకికే ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రిని తప్పిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏ సీనియర్‌కు అవకాశం దొరుకుతుందోననే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications