
బ్యాక్ వాటర్ వస్తే తెలంగాణాప్రాజెక్టులు తీసేస్తారా? అజయ్ ముందు ఖమ్మం చూసుకో: గుడివాడ అమర్నాథ్
గోదావరి వరదల వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త రచ్చకు కారణంగా మారింది. వరదలతో ఇప్పటికే భద్రాచలం, పోలవరం విలీన మండలాలు ముంపుకు గురైన నేపథ్యంలో, ముంపు మండలాలను తమకు తిరిగి ఇచ్చి వేయాలని పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కొత్త రగడకు కారణంగా మారింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు ఒక్కొక్కరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు.

బ్యాక్ వాటర్ వస్తే తెలంగాణాలో అన్ని ప్రాజెక్ట్ లు తీసేస్తారా? మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్న
ఇప్పటికే మంత్రి బొత్స సత్యన్నారాయణ, అంబటి రాంబాబు ఘాటుగా అజయ్తా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే తాజాగా తెలంగాణ ప్రభుత్వం పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్ట ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. అయినా బ్యాక్ వాటర్స్ వల్ల ఇబ్బందులు సహజమని ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బ్యాక్ వాటర్ వస్తుందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. బ్యాక్ వాటర్ వస్తుంది అని తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తీసేస్తారా అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

ఓట్ల రాజకీయాలు చెయ్యటం కరెక్ట్ కాదు.. మంత్రి హితవు
త్వరలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి నాలుగు ఓట్ల కోసం ఇలా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు గుడివాడ అమర్నాథ్. ఖమ్మం జిల్లా లో ఏం జరుగుతుంది అజయ్ ని చూసుకోమని చెప్పండి అంటూ హితవు పలికారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని, అది ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో దీనిపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న డిమాండ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది అందుకే.. డిమాండ్లు ఉంటే ఆమె గౌరవం తగ్గించటమే
ఇక దీనికి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వడానికి సంబంధం లేదని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ ఒక గిరిజన మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టే అవకాశం డిమాండ్లు పెట్టిన ఆమె గౌరవాన్ని తగ్గించడం అవుతుందని ఎలాంటి డిమాండ్లు లేకుండా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపారని వైసీపీ పై జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు.

వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం అందుతుంది.. కానీ ప్రచారమే చేసుకోవటం లేదు
అంతేకాదు చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో భారీ వరద వచ్చిందని, ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో వెళ్లలేని ప్రాంతాలకు బోట్లు, హెలికాప్టర్ల ద్వారా సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కానీ మా ముఖ్యమంత్రికి ప్రచారం ఇష్టం ఉండదు అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు ప్రచారం లేదని పేర్కొన్నారు.