రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోవటంపై మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా రజినీకాంత్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రజినీకాంత్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అడిగినట్టు రజనీకాంత్ కు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరిమీదైనా తమ అభిప్రాయాలను చెప్పొచ్చని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రజినీకాంత్ సినిమాలలో సూపర్ స్టార్ అయితే ఆయనను ఎవరూ ఏమీ అనకూడదా? అంటూ ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్.

రజినీకాంత్ ఏపీకి వచ్చి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మెచ్చుకున్నారని, అందుకే ఆయన పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో రాణిస్తారు అని భావించిన రజినీకాంత్ విమర్శలు తట్టుకునే ధైర్యం లేకనే, రాజకీయ పార్టీని పెట్టి కూడా మళ్లీ విరమించుకున్నారని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమయంలో సీఎం జగన్ ఉత్తరాంధ్ర పర్యటన వివరాలను మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మరో రెండున్నరేళ్లలో మూలపేట పోర్టు కూడా పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్ పోర్టు, డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇక ఇదే సమయంలో ఎప్పుడైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏదైనా ప్రాజెక్టు తీసుకువచ్చారా? అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సిమెంట్ పలక ఉంటే చాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేవారని చంద్రబాబును టార్గెట్ చేశారు గుడివాడ అమర్నాథ్.












Click it and Unblock the Notifications
