పవన్ కల్యాణ్ ప్రశ్నలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇచ్చిన రిప్లై ఇదీ
అమరావతి: వలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం కొనసాగుతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కొన్ని రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ- అటు పవన్ కల్యాణ్ గానీ, జనసేన పార్టీ గానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వలంటీర్ల వ్యవస్థపై తమ దాడిని కంటిన్యూ చేస్తోన్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి వలంటీర్ల వ్యవస్థపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రశ్నాస్త్రాలను సంధించారు. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

వలంటీర్లది ప్రభుత్వ విభాగమే అయితే ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించమని వారిని ఎవరు ఆదేశించారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా?, ముఖ్యమంత్రా?, కలెక్టరా లేక ఎమ్మెల్యేనా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తన ట్వీట్‌ను ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ట్యాగ్ చేశారు.
దీనిపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కల్యాణ్‌ను సంబోధించారు. వలంటీర్లు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు పింఛన్, వారికి అవసరమైన ప్రభుత్వ సర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్దిని అందజేస్తోన్నారని గుర్తు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ప్రాణాలకు తెగించి విధులను నిర్వహించారని, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారని పేర్కొన్నారు. ఆ కష్టకాలంలో నువ్వు, నీ గురువు చంద్రబాబు హైదరాబాద్‌లో ముసుగుతన్ని పడుకున్నారు.. అని గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. వలంటీర్లకు బాస్ ఎవరనే విషయం ఆ రోజు తెలియదా? అని ఎదురుదాడికి దిగారాయన.

ఎవరి ఆదేశాల మేరకు వలంటీర్లు ప్రజలకు మంచి చేస్తున్నారనే విషయం కరోనా సమయంలో గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. వారు ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తారు అనే విషయం కూడా తెలియకుండా రాజకీయాలు చేస్తున్నావా? అంటూ చురకలు అంటించారు. వలంటీర్లపై నిందలు వేయడానికి తయారయ్యావంటూ ధ్వజమెత్తారు.
వాలంటీర్లు చేసే మంచి ఏమిటనేది, వారి వల్ల లబ్ధిపొందుతున్న ప్రజలను నేరుగా కలిసి అడుగాలని సూచించారు. అప్పుడే వారి విలువ ఏమిటో తెలిసి వస్తుందని పేర్కొన్నారు. అంతే తప్ప వారాహి అనే లారీ ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications