వైసీపీ జెండా మోశా.. పక్కచూపులు చూడలేదు: టికెట్ పై మంత్రి జోగి రమేష్ సంచలనం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్చార్జిల మార్పు ఆ పార్టీ నేతలలో టెన్షన్ కు కారణంగా మారింది. ముఖ్యంగా ఏపీలోని మంత్రులు సైతం తమకు టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ టికెట్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన అనుచరులు పెడన నుండి పోటీ చేయాలని కోరుకుంటున్నారని, తాను కూడా పెడన లోనే ఉండాలని అనుకుంటున్నానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సీఎం జగన్ తాను పెడన నుంచి పోటీ చేయాలా లేదా వేరే చోట నుంచి పోటీ చెయ్యాలా అనేది నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ స్పష్టం చేశారు.

ప్రజలలో ఆదరణ లేకుంటే పార్టీ అక్కడ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుందని తాను భావిస్తున్నానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రతి పార్టీలోనూ ఆశావహులు పోటీ చేయాలనుకుంటున్న సీట్లను కావాలని కోరడం పరిపాటిగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఫైనల్ గా పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
సీటు, పోటీ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను పార్టీ కోసం నిబద్ధతతో పని చేశానని పేర్కొన్న ఆయన, వైసీపీ జెండా మోశానన్నారు. ఎప్పుడు పక్క చూపులు చూడకుండా పార్టీ కోసమే పని చేశానన్నారు. ఎక్కడా తప్పటడుగు వేయలేదని ఆయన పేర్కొన్నారు.
పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తనను ఎవరైనా శత్రువుగా చూస్తే అది వారి తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపుపై కసరత్తులు చేస్తున్న వేళ మంత్రి జోగి రమేష్ తన మనసులోని మాట చెప్పారు. తాను పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications