చంద్రబాబు పై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ఆత్మను నేటికి చంపుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారంతా ఒక చోట చేరి మహానాడు.. శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహానాడు వేదికగా రేపు పార్టీ మేనిఫెప్టోను విడుదల చేస్తాననే చంద్రబాబు ప్రకటన పైన మంత్రి స్పందించారు.

చంద్రబాబు ఎన్నికల ప్రణాళికకు విలువ లేదని జోగి రమేష్ ఆరోపించారు. 2014 ఎన్నికల ముందు 600 పైచిలుకు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి కనీసం ఒక్క హామీనైనా ప్రజల దరికి చేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను బానిసలుగానే చూసారని..వారి మేలు కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదన్నారు. అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు బీసీ నాయకులందరి ముందు బీసీలకు మేలు చేశానంటూ చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. సామాజిక న్యాయం సీఎం వైయస్ జగన్‌తోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. బీసీలకు ఆత్మగౌరవం వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ వివరించారు.

బీసీలంతా తలెత్తుకొని తిరుగుతున్నారంటే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన ప్రతి అంశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదల ఈ ప్రభుత్వ పాలనలో ఉందన్నారు. వీటిపై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ పారిపోతుందని మంత్రి ఎద్దేవా చేసారు. 30 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా వైసీపీ ప్రభుత్వ పరిపాలన సాగుతోందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. డీబీటీ ద్వారా 2.10 లక్షల కోట్ల రూపాయలు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో పంపించామని మంత్రి వివరించారు.ఎంతమందితో పొత్తుపెట్టుకొని పొర్లాడినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications