పీ-4 మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబు: మంత్రి జోగి రమేష్ సూటిప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఆరిపోయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడని విమర్శించిన మంత్రి జోగి రమేష్ ఆయన జీవితం గురించి ఐటీడీపీకి తెలియనట్టు ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలియదా అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. మ్యానిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ట్రై చేస్తున్నారని పేర్కొన్న జోగి రమేష్ 2014 టిడిపి మేనిఫెస్టో లోని అంశాలను ప్రస్తావించారు. నాడు సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తానన్నారు అని, రుణమాఫీ కూడా ఇస్తానని మరి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.

14 వేల 500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళలను నిలువునా చంద్రబాబు మోసం చేశారని జోగి రమేష్ విమర్శించారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని, హై స్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని మోసం చేశారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన బెల్ట్ షాపులు కూడా ఎత్తి వేయలేదని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా పీ ఫోర్ మంత్రం అందుకున్నారని చంద్రబాబును టార్గెట్ చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబు అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.చంద్రబాబుకు జగన్మోహన్రెడ్డికి ఎంతో తేడా ఉందని చెప్పిన జోగి రమేష్, మాట ఇస్తే ఎందాకైనా పోరాటం చేసే వ్యక్తి జగన్ అంటూ పేర్కొన్నారు.
పేదలను ధనవంతులు చేస్తాడంట.. పేదలకు ఇళ్లు కట్టిస్తామని అంటే అడ్డుకుని కోర్టుకు వెళ్లిన వ్యక్తి ఇప్పుడు వారిని ఎలా ధనవంతులను చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలని జోగి రమేష్ అన్నారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications