జనసేన మీటింగ్ టీజర్ కు ఉన్నంత హడావుడి సినిమాకు లేదు: మంత్రి కన్నబాబు చురకలు
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో వైసిపి వ్యతిరేక ఓటును చీల్చనివ్వమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఊతమిచ్చాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో అధికార వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పార్టీ ని చంద్రబాబు పార్టీతో ముడిపెడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

జనసేన ఓ చలనం లేని పార్టీ
తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేసిన కన్నబాబు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీని ఒక చలనం లేని పార్టీగా అభివర్ణించిన కన్నబాబు, ఆ చలనం లేని పార్టీ ఏదో సంచలనం సృష్టించినట్లుగా తాము చూడడం లేదని ఎద్దేవా చేశారు.

జనసేన మీటింగ్ టీజర్ కు ఉన్నంత హడావుడి సినిమాకు లేదు
జనసేన పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యం లేదని, చంద్రబాబు కు పట్టం కట్టడం కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. తాను జగన్ ను అధికారంలోకి రానివ్వం అని పవన్ కళ్యాణ్ అంటున్నాడని, పవన్ కళ్యాణ్ లక్ష్యం చంద్రబాబును సీఎం చేయడమే అంటూ మంత్రి కన్నబాబు ఆరోపించారు. జనసేన మీటింగ్ టీజర్ కు ఉన్నంత హడావుడి సినిమాకు లేదని ఎద్దేవా చేశారు. బిజెపి రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని ఆయన ఎదురు చూస్తున్నారు అని చెప్పారు కానీ, జనసేన పార్టీకి ఏ రోడ్ మ్యాప్ లేదని, అసలు రోడ్డే లేదంటూ విమర్శలు గుప్పించారు.

టీడీపీకి అనుబంధంగా జనసేన పార్టీ
తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా జనసేన పార్టీ పని చేస్తుందంటూ మంత్రి కన్నబాబు ఆరోపించారు. బీజేపీ కూడా టీడీపీతో కలిసి పనిచేయాలని అంటున్నారా అంటూ మంత్రి కన్నబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలను పవన్ కళ్యాణ్ కలిపే ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తున్నారు. ఎవరో వస్తారని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూడ్డం లేదని, జగన్మోహన్ రెడ్డి ఒంటిచేత్తో ప్రతి ఒక్కరికి ఎదుర్కోగల సత్తా ఉన్న నాయకుడు అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. సోనియా గాంధీ నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరిని ఒంటిచేత్తో జగన్ ఎదుర్కొన్నాడు అంటూ కన్నబాబు స్పష్టం చేశారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ లక్ష్యం జగన్ సర్కార్ ను కూలదోయటమేనా
పని తీరులో దేశంలో నెంబర్ వన్ గా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఉందని కన్నబాబు కితాబిచ్చారు. వైసీపీ మంత్రులు, నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ సభలో ఆరోపణలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా అంత తేలిగ్గా ఈ ప్రభుత్వాన్ని దెబ్బ తీయలేరని కన్నబాబు హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో వీరిద్దరూ కలిసే పని చేశారని కన్నబాబు ఆరోపించారు. జనసేన పార్టీ సిద్ధాంతం, జనసేనాని లక్ష్యం జగన్మోహన్ రెడ్డి సర్కారును కూలదోయడమేనని మంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications