తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయవాడ వచ్చేయాలి, సినిమా టిక్కెట్లు !!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో కూర్చుని సినిమాలు తీసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి సినిమా టికెట్లు పెంచాలని అడుగుతున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహకరిస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడకు తరలిరావాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి చెందుతుందని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ లో మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడారు. ఎక్కువగా సినిమాల చిత్రీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాకిని ఆధాయం పెరుగుతుందని, ఆ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు కదలాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయని, అయినా కూడా చిత్ర పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటోందని మంత్రి అన్నారు.

చాలామంది నిర్మాతలు వాళ్లు తీసిన సినిమాల టికెట్ల ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని, అలాంటప్పుడు వారు విజయవాడకు వచ్చి స్థిరపడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే ఇక్కడ ఎక్కువ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. తెలుగు సినిమాలకు ఎప్పుడు మా కూటమి ప్రభుత్వం సహాయక సహకారాలు అందిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని మంత్రి దుర్గేశ్ అన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడ తరలివస్తే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు తెలుగు సినీ పరిశ్రమ సహకారం కూడా అవసరం అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 శాతం ఆధ్యాత్మిక టూరిజం ఉందని, తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరంలో స్వామి దర్శనానికి వస్తున్న భక్తులు ఆయా దేవాలయంలను మాత్రమే దర్శించుకుంటున్నారని, ఆ యా దేవాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిసర ప్రాంతంలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించడానికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.












Click it and Unblock the Notifications