పోలవరం కట్టేది కేసీఆర్ నే.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి సంచలనాలు!!
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో రెడ్డి రాజకీయం, కమ్మ రాజకీయం, కాపు రాజకీయం అంటూ రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ అక్కడ అవసరమన్నారు. పోలవరం ప్రాజెక్టును కట్టేది కెసిఆర్ నే అని, సీఎం కేసీఆర్ శక్తి ఏంటో అందరికీ తెలుసని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు . ఏపీ ప్రజలను ఆదుకునే దమ్ము కెసిఆర్ కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేది కూడా కెసిఆర్ నే అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం పని చేస్తున్న కెసిఆర్ ఏపీ ప్రజలను కూడా ఆదుకుంటారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రజలను అక్కడి నాయకులు పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ పవర్ ఏమిటనేది అందరికీ తెలుసని పేర్కొన్న మల్లారెడ్డి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా తమకు కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాదు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్ ఇస్తూ కెసిఆర్ పెద్దకొడుకు లాగా వారికి అండగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి డైనమిక్ మినిస్టర్ యావత్ దేశంలోనే లేరని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి అని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, కెసిఆర్ పై విమర్శలు చేసేవారు ఉసురు కొట్టుకుపోతారని వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మంత్రి మల్లారెడ్డి ఏపీలోని రాజకీయ పార్టీలను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications