గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే సిలిండర్ - ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
గ్యాస్ కష్టాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గ్యాస్ పంపిణీ ఎక్కువ సమయం తీసుకుంటోంది. బుకింగ్ నిబంధనలో చేసిన మార్పులతో బుక్ చేసి.. గ్యాస్ కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో, ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాల మేరకు కీలక సూచనలు చేసింది. 5 కేజీల సిలిండర్లు.. కిరోసిన్ పంపిణీ పైన స్పష్టత ఇచ్చింది.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా కొరతను తీర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామాల్లో సిలిండర్ల డెలివరీ ఆలస్యంపై అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్‌పీజీ ఏజెన్సీలతో నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. గ్యాస్ కొరతను తగ్గించేందుకు త్వరలో 5 కిలోల సిలిండర్ల పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోందని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో కిరోసిన్ సరఫరా కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరఫరాలో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకా ల మేరకు 5 కిలోల సిలిండర్లు అవసరమైన వారికి వెంటనే అందేలా చూడాలని సూచించారు. ఇదే సమయంలో పాడేరు వంటి ప్రాంతాల్లో కిరోసిన్ అవసరం గుర్తించి పంపిణీకి వీలుగా వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కిరోసిన్ అవసరమో ఆ ప్రాంతాల్లో వెంటనే అందేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు.

గ్యాస్ కొరత వేళ అధికారులకు కీలక ఆదేశాలు
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీల్లో ఇప్పటికే నిర్దేశించిన గడువు మేరకు బుకింగ్ కు లాకింగ్ పిరీయడ్ అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నాయి. హెచ్ పీ, భారత్ గ్యాస్ సరఫరా వారం లోపు జరుగుతుండగా.. ఇండేన్ ఏజెన్సీలు మాత్రం వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మూడు వారాల వరకు సమయం తీసుకుంటున్నాయి. ఏజెన్సీల నుంచి సరైన సమాధానం కూడా లేకపోవటంతో వినియో గదారులు నేరుగా ఎజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గ్యాస్ కష్టాల వేళ కేంద్రం 5 కేజీల వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో భారీగా వెసులుబాటు కల్పించింది. ఎవరైనా ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే చిన్న సిలిండర్లు పొందే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో.. 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇటు.. ప్రభుత్వం సైతం 5 కిలోల సిలిండర్ల పంపిణీ.. కిరోసిన్ నిల్వల పైన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications