ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదన్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి పుష్కరాల కోసం ఘాట్ లను నిర్మించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పుష్కరాల ఘాట్లకు పేర్లు పెట్టే విషయంలో చోటుచేసుకున్న ఒక వివాదంపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
గోదావరి నదీ తీర ఘాట్లకు పేర్లు పెట్టటంపై తీవ్ర అభ్యంతరం
స్థానిక అధికారులు అత్యుత్సాహం కారణంగా పవిత్రమైన గోదావరి నదీ తీర ఘాట్లకు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంతుడి ఆరాధనకు, పవిత్రతకు నిలయాలైన పుష్కర ఘాట్లకు ఇలాంటి పేర్లు పెట్టడం హాస్యాస్పదమని, దీన్ని తాము ఎంతమాత్రం సమర్థించబోమని ఆయన తేల్చి చెప్పారు.

నారా లోకేష్ కుమారుడైన 'దేవాన్ష్' పేరు పెట్టటంపై లోకేష్ స్పందన
ముఖ్యంగా, ఒక ఘాట్‌కు నారా లోకేష్ కుమారుడైన 'దేవాన్ష్' పేరును ఖరారు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్ ల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక ప్రదేశాలకు రాజకీయ కుటుంబాల పిల్లల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు.
పేరు తొలగించాలని అధికారులకు ఆదేశం
ఈ రకమైన చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, తక్షణమే ఆ పేరును తొలగించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోని ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు, మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు లేదా నదీ ఘాట్లకు తమ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టకూడదని మంత్రి కచ్చితమైన నిబంధనను విధించారు.
సంస్కృతిని ప్రతిబింబించేలా పేర్లు పెట్టాలి
ఘాట్లకు పేర్లు పెట్టాలనుకుంటే మన సంస్కృతిని ప్రతిబింబించేలా పుణ్యనదుల పేర్లు, దేవుళ్ల నామాలు లేదా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను మాత్రమే పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని, అంతేకాని ఇలాంటి ప్రచారాలకు తాము దూరం ఉంటామని లోకేష్ చెప్పారు. దీంతో ప్రజల నుండి, సామాజిక విశ్లేషకుల నుండి సానుకూల స్పందన లభిస్తోంది.












Click it and Unblock the Notifications