నోరా, మున్సిపాలిటీ నల్లానా?: రోజాను ఏకేసిన పీతల సుజాత
హైదరాబాద్: గోదావరిలో పుష్క ర స్నానానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆంద్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ‘రోజాది నోరా, మున్సిపాలిటీ నాలానా?' అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనుకున్నట్లు జరిగితే రాజకీయంగా తమకు పుట్టగతులుండవని వైయస్సార్ కాంగ్రెసు నేతలు బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. దళితులను దూషించే రోజా దళితుల కోసం మాస్టర్ ప్లాన్‌లో ఏం చేశారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాజమండ్రి దుర్ఘటనపై శవాలమీద చిల్లర ఏరుకున్నట్లు రోజా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. పట్టిసీమపై నానా గొడవ చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఆగస్టు కల్లా ప్రాజెక్టు నుంచి నీరు వచ్చే అవకాశం ఉండటంతో నిద్రపడుతున్నట్లు లేదని వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్ల నజరానా ఇస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించిన విషయం తెలిసిందే. రాజధాని నగర నిర్మాణ బాధ్యత కేంద్రానిదా.. సింగపూర్‌దా? అని ప్రశ్నించారు.
ఈ మాస్టర్ ప్లాన్ చూస్తుంటే మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసినట్లు ఉందని ఆమె మంగళవారం మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లోని అందమైన కట్టడాలను ఒకచోటకు తెచ్చి రాజధాని అంటూ చూపిస్తున్నారని అన్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగర నిర్మాణం ఎలా సాధ్యమని సందేహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రైతులు, బడుగులకు చోటెక్కడ ఉందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications