రాజధాని బిల్లులు వెనక్కి తీసుకున్నాం అంతే! మోడీ సర్కారులా కాదు: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
అమరావతి: మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్రశాసన సభ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్నినాని ఈ విషయంపై స్పందించారు. రాజధాని వికేంద్రీకరణపై ప్రజల్లో కొంత అపోహ ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ క్రమంలో.. మరోసారి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు.

పూర్తిస్థాయి బిల్లుతో త్వరలోనే..
తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల మంచి కోసమేనని పేర్ని నాని అన్నారు.
ఈ వికేంద్రీకరణ బిల్లు ఎందుకు పెట్టాం, మూడు రాజధానుల అంశంపై మరోసారి ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోని.. త్వరలోనే పూర్తిస్థాయి బిల్లుతో ముందుకు వస్తామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.

జగన్ సర్కారు ఒక్కరి కోసం నిర్ణయాలు తీసుకోదు
ఎవరో ఒకరి కోసం జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, వ్యవస్థలను నడపడం చేయదని పేర్ని నాని తెలిపారు. ఈ ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు వస్తున్నాయన్నారు. రాజధాని వికేంద్రీకరణపై టీవీ ఛానళ్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాయన్నారు. మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తమకు అనిపించిందని తెలిపారు. అందుకే మరోసారి సమగ్ర బిల్లును తీసుకొస్తామని చెప్పారు. తమ ప్రాంతాలకు కావాల్సిన అవసరాలను బిల్లులో పొందుపర్చాలని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వారి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మళ్లీ బిల్లులో జత చేస్తామని, అప్పుడే సభ ముందు తీసుకొస్తామని పేర్ని నాని వివరించారు.

మోడీ సర్కారులా కాదు.. ఇది జగన్ ప్రభుత్వం
ఈసారి కోర్టు జోక్యం లేకుండా ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటోందనేది ఊహజనితమనేనని, అవన్నీ ఒక టీవీఛానల్, రాజకీయ విశ్లేషణలు చెప్పేవన్నారు. తమకు వ్యతిరేకంగా కోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చిందన్నారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమేనని వ్యాఖ్యానించారు పేర్ని నాని. కొన్నిసార్లు తమకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు రావచ్చని, దానికీ దీనికీ సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని.. కానీ తాము అలా చేయడం లేదని తెలిపారు మంత్రి పేర్ని నాని. అది మోడీ ప్రభుత్వం.. ఇది జగన్ ప్రభుత్వమని అన్నారు. మళ్లీ అన్ని ప్రాంతాలవారి అభిప్రాయాలను, ఆకాంక్షలను తీసుకుని బిల్లు తయారు చేస్తామన్నారు. అయితే, బిల్లు ఎప్పటిలోగా తీసుకొస్తామనేదానిపై సమయం ఏమీ లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.
Recommended Video

వరద బాధితులను ఆదుకుంటామన్న పేర్ని
ఇక వరదలు, వర్షాలపై మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందిస్తామని పేర్కొన్నారు. పునరావాసం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికోసం ప్రజలు.. 104 సేవలను.. నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్న104 సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విధినిర్వహణలో ముగ్గురు ఉద్యోగులు చనిపోయారని.. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భారీ వరదలకు.. 10 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. వీరి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. అదే విధంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామని, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొవడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు.












Click it and Unblock the Notifications