నేనెవరో తెలుసా..: నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా : మంత్రి పుల్లారావు సతీమణి హల్‌చల్..!
ఎన్నికలు పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అయినా..మంత్రుల కుటుంబ సభ్యుల్లో ఇంకా అధికార దర్పం పోవటం లేదు. తాను మంత్రి సతీమణిని..తనను టోల్ గేట్ సిబ్బంది ఆపటం ఏంటంటూ మంత్రి పుల్లారావు భార్య హల్‌చల్ సృష్టించారు. ప్రతిష్ఠకు పోయి అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. అయినా..చివరకు టోల్ ఫీజు చెల్లించక తప్పలేదు..
టోల్ ఫీజు కోసం గొడవ..
మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులు టోల్ గేట్ సిబ్బందితో గొడవ పడిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అద్దంకి -నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు. దాంతో ఆమె 'నేను మంత్రి భార్యను. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది'అని చెప్పారు. కానీ స్టిక్కర్ అనుమతి కాలపరిమితి దాటిందని, టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు. దీంతో..వారి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది ఆర్‌అండ్‌బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. దీంతో చేసేది లేక చివరకు ఫీజు చెల్లించి వెళ్లిపోయారు.

గతంలోనూ ఆరోపణలు..
మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యుల తీరు పైన గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. అధికారల పైన వారు పెత్తనం చేసే వారని..చిలకలూరిపేటలో నిర్ణయాల పైన వారి ప్రభావం ఉండేదని ప్రచారం ఉంది. గతంలో రాజధాని భూముల వ్యవహారంలోనూ భార్య పేరుతో పుల్లారావు స్థలాలు రిజిస్టర్ చేయించారు. దీంతో..అప్పుడు అసెంబ్లీలోనూ ఆ అంశం చర్చకు వచ్చింది. అయితే, కొంత కాలంగా పుల్లారావు కుటుంబ సభ్యుల మీద ఆరోపణల తీవ్రత తగ్గింది. కానీ, తిరిగి ఇప్పుడు టోల్ ఫీజు చెల్లింపు కోసం అధికారం పేరుతో తగవుకు దిగటంతో మరో సారి వివాదాస్పదం అయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications