జగన్ ఆస్తులు ఈడీ అటాచ్: వరుసపెట్టి విమర్శించిన ఏపీ మంత్రులు
అమరావతి: ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా వైసీపీ అధినేత జగన్ ఆస్తులను అటాచ్ చేసిన నేపథ్యంలో ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేదవాడి పొట్టగొట్టి కోట్లు కూడబెట్టిన వైయస్ జగన్ సర్వనాశనం అవడం ఖాయమని మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పార్టీ మూతపడటం ఖాయమని, జగన్ శని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇంతపెద్ద కుంభకోణం ఎక్కడా చూడలేదని, జగన్ కేసులో న్యాయవాదులే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాల నుంచి జగన్ తప్పించుకోలేరని అన్నారు.
ఇక హైకోర్టు విభజనపై లాయర్లు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. టీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పట్ల స్నేహపూర్వకంగా మెలిగే తరుణం ఆసన్నమైందని అన్నారు. హైకోర్టు విభజన... గవర్నర్ లేదా కేంద్రం వద్ద కూర్చుని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన సూచించారు.

అవసరమైతే ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. వరంగల్‌లో జడ్జిపై దాడి వ్యవస్థకు మాయని మచ్చ అని అన్నారు.
ఆస్తుల ఆటాచ్ మెంట్‌కు జగన్ సమాధానం చెప్పాలి: మంత్రి దేవినేని
ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ దోచేసుకున్నారని ఆయన అన్నారు.
అవన్నీ బట్టబయలవుతున్నాయని పేర్కొన్నారు. తాము పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏపీ నూతన రాజధాని అమరావతికి తరలిస్తుంటే దానిపై జగన్ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇస్తే హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు: ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
వైసీపీ అధినేత వైయస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈడీ రూ.46వేలకోట్ల ఆస్తులు అటాచ్ చేసిందని, జగన్ అక్రమాస్తులు ఇంకా బయటపడతాయని పేర్కొన్నారు.
జగన్ వైఖరిని ఆపార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. గోదావరి అంత్యపుష్కరాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications