మంత్రి రోజా vs నారా బ్రాహ్మణి
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నాయకుల మధ్య వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తోన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి చేసిన విమర్శలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. గతంలో బ్రాహ్మణి చేసిన ట్వీట్‌కు తాజాగా రిప్లై ఇచ్చారు రోజా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగాయంటూ సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారంటూ చేసిన ట్వీట్‌కు రోజా..బదులిచ్చారు.
చంద్రబాబు చేసిన ఆర్థిక మోసాన్ని సమర్థించడానికి బ్రాహ్మణి, ఆమె కుటుంబ సభ్యులు ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నారని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమౌతోందని రోజా అన్నారు. చంద్రబాబు అండ్ కో వందలాది కోట్ల రూపాయల మేర ప్రజా ధనాన్ని దోచుకున్నారనేది ఆధారాలతో సహా తేలిందని గుర్తు చేశారు.

సీమెన్స్ కంపెనీతో కలిసి చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డాడని, ఆ కారణంతోనే సుమన్ బోస్‌ను కంపెనీ యాజమాన్యం తొలగించిందని రోజా తెలిపారు. వైసీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల తప్పు ఒప్పయినట్లు కాదని, నిరుద్యోగులు, యువత పేరు చెప్పుకొని చంద్రబాబు అడ్డంగా దోచుకున్నాడని ధ్వజమెత్తారు.
ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు సాగుతోందని, ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రోజా అన్నారు. వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనం ఏమైందనే విషయాన్ని నిర్ధారించడంపైనే తమ దృష్టి నిలిచిందని పేర్కొన్నారు. నిజాన్ని వెలికి తీయడానికి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికే విచారణ జరుగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications