రజినీకాంత్ తన వ్యాఖ్యలతో జీరో అయ్యారు: మళ్ళీ చెలరేగిపోయిన మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, రజినీకాంత్ ఎన్టీఆర్ పైన, చంద్రబాబుపైన ప్రశంసల జల్లు కురిపించటం ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణంగా మారింది. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలతో రజినీకాంత్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును నమ్మొద్దు అంటూ విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతు ఇచ్చాడని, అటువంటి రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇక దీంతో చంద్రబాబు ఎన్టీఆర్ ని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మరింత రాజకీయ రగడ చోటు చేసుకుంది.
తాజాగా మంత్రి ఆర్.కె.రోజా మరోమారు సూపర్ స్టార్ రజినీకాంత్ పై మండిపడ్డారు. తిరుకంచి గంగై వరదరాజు నాదీశ్వర ఆలయంలో పుష్కరిణి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుదుచ్చేరి వెళ్ళిన రోజా రజనీకాంత్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని పేర్కొన్న రోజా, రజినీకాంత్ తాను చేసిన వ్యాఖ్యలతో జీరో అయ్యారని విమర్శించారు. రజినీకాంత్ ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పేరు పోగొట్టుకున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసలు రాజకీయాలు వద్దు అనుకున్న రజినీకాంత్ మళ్లీ ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసిన రజినీకాంత్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఉన్నారని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని చంద్రబాబు చేసిన అరాచకం అంతా రజినీకాంత్ కు తెలుసని రోజా పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతుగా నిలిచారని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అని పేర్కొన్నారు.
అసలు ఎన్టీఆర్ గురించి రజినీకాంత్ మాట్లాడటం అభిమానులను బాధించిందని వెల్లడించారు. తెలుగు ప్రజలు రజినీకాంత్ ను సూపర్ స్టార్ గా భావించారని, కానీ రజినీకాంత్ తన పేరు తానే చెడగొట్టుకుంటున్నాడని రోజా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును పొగుడుతూ రజినీకాంత్ ప్రసంగం చేయడం దారుణమన్నారు.
రజినీకాంత్ ను పెద్ద స్థాయిలో ఊహించుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు ఆయన స్థాయిని కోల్పోయాడని రోజా వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ అడగాలి అని అనుకోవడం లేదని రోజా పేర్కొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసి తెలియక మాట్లాడాడు కాబట్టి, ఆయన మాటల పైన ఆయనే ప్రకటన విడుదల చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications