మహిళలకు ఉచిత బస్సు పై కొత్త ట్విస్ట్ - జిల్లాలకే పరిమితం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు పైన ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత మంత్రులతో అధ్యయనం కోసం మరో కమిటీ నియమించారు. కాగా, ఈ పథకం అమలు పైన తాజాగా ప్రభుత్వం శాసన మండలి లో స్పష్టత ఇచ్చింది. జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది.
మహిళలకు ఉచిత బస్సు
ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తీసు కుచ్చింది. తాజాగా 2025-26 బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా పీఎం కిసాన్ పథకం కింద అందే రూ 6 వేలు మినహాయించి ఒక్కో రైతుకు రూ 14 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మే నెలలో ఈ రెండు పథకాల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మంత్రి ప్రకటన
ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తాజాగా శాసన మండలిలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితమని వెల్లడించా రు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా వైసిపి సభ్యులు పివి సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు అంశం ప్రస్తావించారు. దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పామని.. ఇప్పుడు దీని అమలు పైన స్పష్టత ఇస్తున్నట్లు వివరించారు.
జిల్లా పరిధిలోనే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు కోసం ఆర్టీసీలో కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది అవసరం గురించి నివేదిక ఇచ్చారు. ముగ్గురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. పథకం అమలు చేస్తున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకలో అధ్యయనం చేసారు. ఆర్దికంగా భారం, ప్రయాణీకుల నుంచి వస్తున్న స్పందన, పథకం అమల్లో సమస్యల గురించి ఆరా తీసారు. రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ సమయంలో మంత్రి సంధ్యారాణి ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయనున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications